Be alert: పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం లో శుక్రవారం రాత్రి చెరుకువారిపల్లి సమీపంలో విద్యుత్ షాక్ కు గురై ఏనుగు మృతి చెందిన స్థలాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. అనంతరం జోగివారి పల్లె పంచాయితీ కే. గొల్లపల్లె లో గురువారం రాత్రి ఏనుగుల దాడిలో మృతి చెందిన నల్లగాసుల ఎల్లప్ప కుటుంబాన్ని పరామర్శించారు.
ఎల్లప్ప కుటుంబానికి నష్టపరిహారం గా 5 లక్షల రూపాయలను అటవీ శాఖ నుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చిన పెద్దిరెడ్డి మరో 5 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఏనుగుల భయం వల్ల స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ట్రాకర్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని ఏనుగుల కదలికలను ప్రజలకు తెలియజెప్పి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు కదలికల పై పెద్దిరెడ్డి ఆరా తీశారు. మంత్రి వెంట తంబళ్లపల్లె, పీలేరు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు.