CM-Ugadi: శ్రీ శుభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఏడాది నామంలోనే శుభం ఉందని, ప్రజలందరికీ మంచి జరుగుతుందని పంచాంగాలు కూడా చెబుతున్నాయని సిఎం సంతోషం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో ఉన్న గోశాలలో జరిగిన ఉగాది వేడుకల్లో సిఎం జగన్, సతీమణి భారతితో కలిసి పాల్గొన్నారు. దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి మరింతగా బలాన్ని ఇవ్వాలని, ఈ ఏడు ప్రజలకు మరింత మేలు చేసే పరిస్థితులు రావాలని సిఎం అభిలషించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సిఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయాల పండితులు సిఎం దపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఉగాది పంచాగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్క రించారు. సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన సంక్షేమ క్యాలండర్ ను, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు తయారు చేసిన పంచాగాన్ని కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘తెలుగు సాహిత్యం సమాజం చరిత్ర’ అనే పుస్తకాన్ని సిఎం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ సంగీతం నృత్య కళాశాలల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
Also Read : శుభకృత్ సంవత్సర ఫలాలు