Its not fair: అమరావతి అభివృద్ధికి 60 నెలలు పడుతుందని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం హాస్యాస్పదమని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. అఫిడవిట్ లో ప్రభుత్వం అసత్యాలు చెప్పిందని, చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు. ఈ మూడేళ్ళలో అమరావతిలో కానీ, మూడు రాజధానుల్లో గానీ ఒక్క రూపాయి పని కూడా చేయలేదన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తారో లేదోకూడా అఫిడవిట్ లో చెప్పలేదన్నారు. మూడేళ్ళలో ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేని ఈ ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా కడుతుందని ప్రశ్నించారు. రాజధాని పనులు కొనసాగించకుండా 10వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఢిల్లీ లో సహచర ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు హయాంలో 5739.94 కోట్ల రూపాయల పనులు అమరావతిలో పూర్తి చేశారని, మరో 41,679 కోట్ల రూపాయల పనులు మొదలు పెట్టారని కూడా అఫిడవిట్లో పేర్కొన్నారని కనకమేడల వివరించారు. చంద్రబాబు ల్యాండ్ పోలింగ్ అనే ఓ వినూత్న విధానంతో రైతుల నుంచి భూమి సేకరించి, వారికి సీఆర్డీఏ చట్టం ద్వారా రక్షణ కల్పించారన్నారు.
మూడేళ్ళలో విద్యుత్ రంగాన్ని జగన్ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా జగన్ ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త శ్లాబుల వల్ల పేదవాడు కనీసం కరెంటు వాడుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారన్నారు. విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేయడం పక్కన పెట్టి కనీసం ఉన్న వ్యవస్థను కూడా సక్రమంగా కాపాడుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. పన్నుల ద్వారా ప్రజల నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలా అనే అలోచిస్తున్నరన్నారు. చంద్రబాబు ఐదేళ్ళలో కనీసం ఒక్కరోజు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు.
Also Read : టిడిపి ఆరోపణలు హాస్యాస్పదం: బుగ్గన