తెలంగాణలో ఆప్ కీలక అడుగులు వేస్తోంది. పంజాబ్ లో ఏకపక్ష విజయంతో ఆప్ ప్రస్థానం పైన దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తొలి ప్రాంతీయ పార్టీ ఆప్. ఇక, ఆప్ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేసింది. ఈ మధ్య కాలంలో చేసిన సర్వేల్లో తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనే అవకాశం ఉన్నట్లుగా తేలిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు కార్యాచరణ సిద్దం చేసారు.
హైదరాబాద్ లో కేజ్రీవాల్ పర్యటన
పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జి సోమనాథ్ భారతి ఇప్పటికే వారంలో రెండురోజులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలతో తరుచూ సమావేశమవుతూ పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నారు. ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నెల 14న హైదరాబాద్‌కు రానున్నారు. అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని 14న నగరంలో పాదయాత్ర చేపట్టాలని ఆప్ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఛార్మినార్ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రను కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణలో భాగంగా వేస్తున్న తొలి అడుగులోనే పార్టీలో చేరికలు ఉండేలా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
కేజ్రీ సమక్షంలో ఆప్ లో చేరికలు
పార్టీ నేతలు ఇస్తున్న సమాచారం మేరకు కాంగ్రెస్ – బీజేపీని వ్యతిరేకంచే పార్టీల నేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఒక జాతీయ పార్టీలో 2014లో ఎంపీగా గెలిచి.. కొద్ది రోజుల క్రితం మరో జాతీయ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగిన ఒక మాజీ ఎంపీ సైతం కేజ్రీవాల్ సమక్షంలో ఆప్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో సుదీర్ఘ కాలం శాసనసభ్యులుగా పనిచేసిన వారి కుటుంబీకులను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంతనాలు సాగుతున్నాయి. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఓ మాజీ ఐఏఎస్ సైతం కేజ్రీవాల్ సమక్షంలో ఆప్ లో చేరేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. హైదరాబాద్ కు సమీపంలో గతంలో ఎంపీగా చేసిన మరో కీలక నేతతో సైతం ఢిల్లీ కేంద్రంగా చర్చలు చేసినట్లు సమాచారం. వీరంతా కేజ్రీవాల్ సమక్షంలో ఆప్ లో చేరటం ద్వారా పార్టీ కొత్తగా వేసే అడుగుల్లో జోష్ రానుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఆ మూడు పార్టీలతో ఢీ కొట్టేనా
2019 ఎన్నికల్లో తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లకు గాను 41 స్థానాల్లో ఆప్ తరఫున అభ్యర్థులు పోటీ చేసినా డిపాజిట్లు దక్కలేదు. మొత్తంగా 13,134 ఓట్లు (0.06 శాతం)మాత్రమే వచ్చాయి. అయితే, వచ్చే ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొలి పర్యటన ద్వారా కేజ్రీవాల్ పార్టీ సభ్యత్వ నమోదు సైతం ప్రారంభిస్తారని చెబుతున్నారు. దీని ద్వారా స్థానిక అంశాల ఆధారంగా ప్రజల్లోకి వెళ్తూ.. పార్టీని బలోపేతం చేసే దిశగా ఆప్ కసరత్తు చేస్తోంది. ప్రధానంగా విద్యా వంతులు.. ఉద్యోగులు.. మధ్య తరగతి ప్రజలు తమ ఆప్ వైపు ఆకర్షితులవుతున్నారని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. రాజకీయంగా టీఆర్ఎస్ – బీజేపీ – కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలు హోరా హోరీగా తలపడుతున్న సమయంలో ఆప్ వీటిని ఎదుర్కొని ఎలా ముందుకెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.
Also Read : గుజరాత్, హిమాచల్ పై కన్నేసిన ఆప్