Social Engineering: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈనెల 11న సోమవారం పునర్ వ్యవస్థీకరించనున్నారు. సిఎం జగన్ ఈ సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలుసుకున్నారు. మంత్రివర్గ మార్పుపై సమాచారం అందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా జగన్ కోరారు.
రేపు మధ్యాహ్యం సిఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అనంతరం మంత్రులంతా తమ రాజీనామాలను సిఎంకు సమర్పించనున్నారు. తర్వాత ఈ రాజీనామాలను సిఎంవో రాజ్ భవన్ కు పంపించనుంది. గవర్నర్ లాంఛనంగా ఆమోదిస్తారు.
ఈనెల 11న ఉదయం 11.35 గంటలకు కొత్త మంత్రివర్గం కొలువుతీరనుంది. ఈసారి విస్తరణలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీచేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్న నేపథ్యంలో ఈ అంశం కూడా విస్తరణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, బీసీలకు చెందిన వారికి రాజకీయ పదవులు ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకుపైనే సిఎం దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ ప్రక్షాళనలో ఎక్కువమంది బీసీలకు స్థానం కల్పించనున్నారు. రెడ్డి సామాజికవర్గానికి ప్రస్తుతం ఉన్న మంత్రి పదవుల సంఖ్యను మరింతగా తగ్గిస్తారని సమాచారం. రేపు సాయంత్రానికి కొత్త మంత్రుల జాబితాను వెలువరించే అవకాశం ఉంది.