బెయిల్ మంజూరైన అత్యాచార నిందితుడికి స్వాగతం పలుకుతూ.. ‘ భయ్యా ఈజ్ బ్యాక్ ’ అంటూ హోర్డింగు పెట్టడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి బెయిల్‌ను రద్దు చేయాలంటూ బాధితురాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ సందర్భంగా హోర్డింగు విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీంతో డిఫెన్స్ న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. ‘‘భయ్యా ఈజ్ బ్యాక్ అని హోర్డింగు పెట్టడమేంటి..? అసలు దీని అర్థమేంటి..? అని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వారం మీ భయ్యాను జాగ్రత్తగా ఉండమని చెప్పండి’’ అని సుప్రీం హెచ్చరించింది .
మధ్యప్రదేశ్ జబల్ పూర్ కు చెందిన యువతిని ఏబివిపి నాయకుడు శుభంగ్ గొంతియా వివాహం చేసుకుంటానని మోసం చేశాడు. 2021 లో మిత్రుల సమక్షంలో యువతికి తాళి కట్టిన శుభంగ్ బహిరంగంగా ఆమె తన భార్య అని ప్రకటించక పోవటంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో యువతీ గర్భవతి కాగా బలవంతంగా అబార్షన్ చేయించాడు. శుభంగ్ పై జబల్ పూర్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆ రోజు నుంచి ఆయన పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత భోపాల్ హైకోర్టు నుంచి శుభంగ్ బెయిల్ పొందాడు. అయితే నిందితుడు శుభంగ్ కు బెయిల్ రావటంతో ఆయన అనుచరులు నగరంలో భయ్యా ఈజ్ బ్యాక్ అని పోస్టర్లు వేశారు. దీనిపై యువతీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. భోపాల్ హైకోర్టు వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ మంజూరు చేసిందని, పోస్టర్ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. ఈ కేసు విచారణ ఈ నెల 18 వ తేదిన మరోసారి సుప్రీం కోర్టు లో విచారణకు రానుంది.