శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా విదేశీ అప్పును ఇప్పట్లో తీర్చలేమని ప్రకటించింది. ఈ మేరకు 51 బిలియన్ డాలర్ల రుణాల చెల్లింపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ప్రజలకు అవసరమైన ఆహారం, ఇంధనం, ఔషధాలు వంటి అత్యవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి పరిమితంగా ఉన్న విదేశీ నిల్వలను కాపాడుకోవాలని, దానికోసం విదేశీ రుణ చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
“ప్రస్తుతం రుణ చెల్లింపులు చేయడం సవాల్‌తో కూడుకున్నది. నిజం చెప్పాలంటే అసాధ్యం అనే స్థితికి వచ్చింది. రుణాల చెల్లింపులను నిలిపివేయడం ఉత్తమమైన చర్య” అని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పి.నందలాల్ వీరసింగ్ స్థానిక మీడియాతో అన్నారు. అయితే ఇప్పటికే అక్కడ మందులు, ఇంధనంతో సహా నిత్యావసరాలను దిగుమతి చేసుకోలేకపోతుంది. దాంతో సాధారణ ప్రజలకు మందులు అందడం లేదు. ఔషధాల కొరత కారణంగా డాక్టర్లు సర్జరీలను కూడా చేయడం లేదని తెలుస్తోంది. దీంతో అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మరోవైపు ప్రజలకు నిత్యావసర వస్తువులు దొరకడం గగనంగా మారింది. ప్రతి వస్తువు ధర అత్యధికంగా ఉండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ప్రజల ఆందోళనకు బౌద్ధగురువులు కూడా మద్దతు పలికారు. దీంతో ఆర్థిక మాంద్యంపై చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు నిరసనలు విరమించాలని ప్రభుత్వం కోరుతోంది. మరోవైపు దేశంలో ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని విపక్షాలు విమర్శిస్తున్నారు. కాకపోతే ఈ ఆరోపణలను రాజపక్ష కొట్టివేస్తున్నారు.
Also Read : శ్రీలంకలో దుర్భర పరిస్థితులు