Friday, March 29, 2024
HomeTrending Newsశ్రీలంకలో దుర్భర పరిస్థితులు

శ్రీలంకలో దుర్భర పరిస్థితులు

Srilanka Crisis  : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. రోజుకు 13 గంటల విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నీళ్లు కూడా బ్లాక్ లో కొనుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. పేపర్ కొరతతో విద్యార్థుల పరీక్షలను కూడా వాయిదా వేశారంటే ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరుకుల కోసం జనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరి కొందరు దేశం దాటి పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.

నిన్న అర్ధరాత్రి కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని వేలాది మంది ప్రజలు చుట్టుముట్టారు. అధ్యక్ష భవనం ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 5 వేల మంది నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి చేయి దాటి హింసాత్మకంగా మారింది. పోలీసుల మీదకు నిరసనకారులు రాళ్లు, బాటిళ్లు విసిరారు. దీంతో, టియర్ గ్యాస్, జల ఫిరంగులను పోలీసులు ప్రయోగించారు. ఈ క్రమంలో, నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు.

ఈ నేపథ్యంలో, శ్రీలంక ప్రభుత్వం కొలంబోలో 144 సెక్షన్ విధించింది. సైన్యాన్ని రంగంలోకి దించింది. మరోవైపు నిరసనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్ష భవనంలో లేరని సమాచారం. ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పోలీసులు అడ్డుకుని ఉండకపోతే అధ్యక్ష భవనంపై దాడి జరిగేది. ప్రశాంతంగా ఉండే శ్రీలంక ఇప్పుడు రణభూమిని తలపిస్తోంది. తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఏ క్షణంలోనైనా అక్కడి పరిస్థితులు పూర్తిగా దిగజారే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 పరిస్థితులు ఇంతగా దిగజారడానికి కారణం ఇదే:
ద్వీప దేశమైన శ్రీలంక… చుట్టూ సముద్రం, బీచ్ లు, దట్టమైన అడవులు, అందమైన ప్రకృతితో అలరారుతుంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీలంకకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. శ్రీలంకకు ప్రధాన ఆదాయ వనరు టూరిజం కావడం గమనార్హం. అయితే, కరోనా మహమ్మారి ఆ దేశ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. కరోనా నేపథ్యంలో టూరిస్టులు రాకపోవడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది.

మరోవైపు, దిగుమతుల్ని నిషేధిస్తూ 2020లో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారింది. విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేసి, 51 బిలియన్ డాలర్ల అప్పులను తీర్చాలని ఆ దేశ ప్రభుత్వం ఆలోచించింది. అయితే, ఈ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది. దిగుమతులు ఆగిపోవడంతో ఇప్పుడు ఆ దేశంలో ఏ వస్తువూ దొరకని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి ఈ రెండు అంశాలే కారణం. ఇప్పుడు నెలకొన్న గడ్డు పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కాక అక్కడి పాలకులు తలలు పట్టుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్