ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ను కలవ నున్నారు. ఇటీవల సిఎం జగన్ ఢిల్లీలో రెండ్రోజులపాటు పర్యటించారు, రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్, కొత్త రేషన్ కార్డులు జాతీయ ఆహార భద్రతా చట్టం కిందకు తీసుకు రావడం, గృహ నిర్మాణానికి సహకారం లాంటి అంశాలను కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడితో చర్చించారు. పర్యటన విశేషాలను వివరించడంతో పాటు గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీల విషయమై కూడా గవర్నర్ తో సిఎం చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే ప్రభుత్వం నాలుగు పేర్లను ఖారారు చేసినట్లు వార్తలు వచ్చాయి, తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి), మోశేన్ రాజు (పశ్చిమ గోదావరి), ఎల్. అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేశ్‌యాదవ్ (కడప) పేర్లను ఖరారు చేసింది. ఈ పేర్లతో కూడిన లేఖను స్వయంగా ముఖ్యమంత్రి గవర్నర్ కు అందిస్తారని తెలిసింది.
అయితే ఇటీవల ఒక్కరోజు పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ గా ప్రారంభించారు. కోవిడ్ కారణంగా స్వయంగా సభకు అయన హాజరు కాలేకపోయారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సిఎం ప్రసంగించారు. ఈ విషయమై కూడా సిఎం ప్రస్తావిస్తారని తెలిసింది.