Saturday, November 23, 2024
Homeసినిమాఅంజలి బాటలోనే అనన్య నాగళ్ల!

అంజలి బాటలోనే అనన్య నాగళ్ల!

Ananya: తెలుగు తెరపై కథానాయికగా తమని  తాము నిరూపించుకోవాలనే తహ తహ చాలా మంది తెలుగు అమ్మాయిల్లో కనిపిస్తుంది. కానీ తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు అవకాశం దక్కడమనేది అనుకున్నంత తేలికేం కాదు. తెలుగు సినిమాలో గ్లామర్ పాళ్లు పెరిగిన దగ్గర నుంచి ఇక్కడ ముంబై ముద్దుగుమ్మల జోరు పెరిగింది. తమిళ .. మలయాళ భామల హవా కొనసాగుతోంది. అందాల ఆరబోతలో పెద్దగా అభ్యంతరాలు చెప్పని ఆ భామల ధాటిని తట్టుకోవడం తెలుగు అమ్మాయిలకు పెద్ద సవాలుగా మారింది. అసలు వాళ్లను దాటుకుని  అవకాశాన్ని చేజిక్కించుకోవడమే ఒక  ఛాలెంజ్ గా మారింది.

అలాంటి పరిస్థితుల్లో స్వాతి రెడ్డి  కాస్త ధైర్యం చేసి ముందుగా తమిళంలో తానేమిటనేది నిరూపించుకుంది. ఆ తరువాత మలయాళ సినిమాలపై కూడా తనదైన మార్కు వేసింది. అప్పుడుగానీ ఆమెకి తెలుగులో చెప్పుకోదగిన పాత్రలు పడలేదు. ఆమె తరువాత వచ్చిన అంజలి కూడా అదే బాటలో అడుగులు వేసింది. ఈ ‘రాజోలు’ అమ్మాయి తమిళంలో చక్రం తిప్పేసిన తరువాతనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సీనియర్ స్టార్ హీరోల సరసన నాయికగా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను భారీ హిట్లను తన ఖాతలో వేసుకుంది.

ఆ తరువాత ‘వరంగల్’ నుంచి వచ్చిన ఆనంది .. ముందుగా తెలుగు సినిమాలే చేసింది. అయితే ఆశించినస్థాయి గుర్తింపు రాకపోవడంతో కోలీవుడ్ వెళ్లింది. కథానాయికగా అక్కడ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న తరువాతనే, తెలుగు నుంచి ‘జాంబీ రెడ్డి’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ వెళ్లాయి. కొత్తగా ‘ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలోను ఎంపికైంది. ఇదే ‘వరంగల్’కి చెందిన ఈషా రెబ్బా కూడా తమిళ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అదే తరహాలో ‘సత్తుపల్లి’ అమ్మాయి అనన్య నాగళ్ల కూడా ముందుకు వెళుతోంది.

‘మల్లేశం’ సినిమాతో పరిచయమైన ఈ అమ్మాయి, ‘వకీల్ సాబ్‘తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశాలమైన కళ్లతో హావభావ విన్యాసాలు చేయించడం ఈ అమ్మాయి ప్రత్యేకత. ఆకర్షణీయమైన రూపం .. సహజమైన సౌందర్యం ఆమె సొంతం. ఇక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ ఫై  దృష్టి పెట్టింది. అక్కడ శశి కుమార్ జోడీగా ఒక సినిమా చేయనుంది. పా. శరవణన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అంజలి ..  ఆనంది మాదిరిగానే ఈ అమ్మాయి ఈ సినిమా తరువాత అక్కడ బిజీ అవుతుందేమో చూడాలి.

Also Read : చరణ్ సినిమాలో అంజలి పాత్ర అదేనా?! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్