Tuesday, September 24, 2024
HomeTrending Newsవెంకయ్య కొనసాగింపు!?

వెంకయ్య కొనసాగింపు!?

Venkayya to continue? భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఆ పదవిలో మరో పర్యాయం కొనసాగించేందుకు కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  పరిస్థితులను బట్టి ఆయన్ను రాష్ట్రపతిగా కూడా ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిర్ణయించినట్లు ఇటీవల వార్తలు రావడం, వాటిని వెంకయ్య కార్యాలయం ఖండించడం తెలిసిందే.

అయితే నేడు మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పిన్నమనేని కోటేశ్వర రావు విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన సభలో వెంకయ్య మాట్లాడుతూ  వీలైనంత త్వరలో బాధ్యతల నుంచి విముక్తి లభిస్తే  త్వరగా జనం మధ్యలోకి దూరాలని తనకు ఉందని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి  త్వరగా పదవీ బంధ విముక్తుడై, సన్నిహితులు, మిత్రుల మధ్య గడపాలని తనకు  ఉందని మనసులో మాట చెప్పారు. కానీ వెంటనే ‘ఏం జరగబోతుందనేది మన చేతుల్లో ఉండే విషయం కాద’నిఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

వెంకయ్యను భారత రాష్ట్రపతిగా కంటే ఉపరాష్ట్రపతిగా మరో పర్యాయం కొనసాగించేందుకే కేంద్ర పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. కేంద్రం త్వరలో కామన్ సివిల్ కోడ్ లాంటి కొన్ని కీలక బిల్లులు తీసుకురావాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో, ఇలాంటి సమయంలో  ఎగువ సభలో  వెంకయ్య సేవలు ఎంతో అవసరమని  భావిస్తున్నారు. అందుకే వెంకయ్యను ఒప్పించేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది.

తన రాజకీయ  జీవితం మొదటి నుంచీ మిత్రులు, స్నేహితులను నిరంతరం కలుసుకోడానికి…. సామాజిక సేవా కార్యక్రమమాల్లో భాగంగా ఎందరో వ్యక్తులతో కలిసి మెలిసి పనిచేయడానికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన  వెంకయ్యకు ఉపరాష్ట్రపతిగా ‘ప్రోటోకాల్’ నిబంధనలు అడ్డంకిగా మారాయి. దీనితో  ఆయన రిటైర్ కావాలనుకున్నా కేంద్ర పెద్దలు మాత్రం ఆయన్ను ఎలాగోలా ఒప్పించి దేశానికి అయన సేవల కొనసాగింపుకు పట్టుబడుతున్నట్లు వెంకయ్య నేటి వ్యాఖ్యలతో అవగతమవుతోంది.

భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, వెంకయ్యకు ముందు ఈ బాధ్యతలు నిర్వహించిన హమీద్ అన్సారీలు రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగారు. అదే సంప్రదాయం ప్రకారం వెంకయ్యకు కూడా కొనసాగింపు  ఇస్తారో లేక భారత ప్రథమ పౌరుడిగా ప్రతిపాదిస్తారో చూడాలి.

Also Read : మేనిఫెస్టోకు చట్టబద్ధతపై చర్చ జరగాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్