తైవాన్ లో కోవిడ్ రెండో దశ సీరియస్ గానే ఉంది. దేశ ప్రజలకు ఇచ్చేందుకు సరిపడ వ్యాక్సిన్ నిల్వలు లేవు. అయినా సరే చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రసక్తే లేదని తైవాన్ ప్రభుత్వం నిర్ణయించింది. తైవాన్ తమ అంతర్భాగమని వాదిస్తున్న చైనా తీరును ఈ దేశ పాలకులు, ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. దీంతో పాటు చైనా వ్యాక్సిన్ సమర్థత పై వారికి అనుమానాలు ఉన్నాయి.
మొదటి దశలో కోవిద్ద్ కట్టడిలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినా తైవాన్ రెండో దశలో విమాన యాన సిబ్బంది ద్వారా ఆల్ఫా వేరియంట్ రావటంతో కేసులు పెరిగాయి. దీంతో అన్ని రకాల విద్యాలయాలు, సామూహిక కార్యక్రమాల్ని నిషేదించారు.
ఈ ఏడాది మార్చి నుంచి టీకాలు ఇవ్వటం ప్రారంభించినా దేశ జనాభాలో కేవలం 3.36 శాతం జనాభాకు మాత్రమె మొదటి డోసు అందింది. వ్యాక్సిన్ తగినంతగా సరఫరా లేకపోవటంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా, జర్మని దేశాల సంస్థల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించినా చైనా కొన్ని అడ్డంకులు సృష్టించింది.
తైవాన్ ను కూడా కలుపుకుని ‘ గ్రేటర్ చైనా’ పేరుతో ఫైజేర్ సంస్థ – చైనా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో కరోన వ్యాక్సిన్ సాయం చేస్తామని నెల రోజుల నుంచి చైనా పాలకులు ఆఫర్ చేస్తున్నా తైవాన్ పాలకులు నిరాకరిస్తున్నారు. ఇతర దేశాల నుంచి టీకా రాకుండా చైనా అడ్డుపడుతోందని తైవాన్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
త్వరలోనే పది లక్షల టీకాలు పంపిస్తామని మిత్ర దేశమైన జపాన్ ప్రకటించటం తైవాన్ కు కొంత ఉరట. ముగ్గురు అమెరికన్ సెనేటర్ లు మరో ఏడున్నర లక్షల వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించగా, అమెరికా ఇతర దేశాలకు అందిస్తున్న వ్యాక్సిన్ సాయంలో తైవాన్ ను కుడా చేర్చుకోవాలనే డిమాండ్లు అమెరికాలో ఎక్కువయ్యాయి.