Doctor-Minister: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ డెవలప్మెంట్ శాఖల మంత్రి డా. సీదిరి అప్పలరాజు మరోసారి స్టెతస్కోపు పట్టి వైద్యం చేశారు. ముగ్గురి ప్రాణాలు కాపాడి వైద్య వృత్తి పట్ల తన అంకిత భావాన్ని, మమకారాన్నిమరోసారి చాటుకున్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో ఒక మహిళ మనస్థాపానికి గురై తన పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటిలోనే ఇద్దరు పిల్లలకు విష పదార్థం తాగించి తను కూడా తాగేయడంతో అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి అప్పలరాజు ఆస్పత్రి వైద్యుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని ప్రాథమిక చికిత్స చేయమని, తను వచ్చేలోగా అపస్మారక స్థితిలో ఉన్న వారికి అందించాల్సిన వైద్యంపై పోనులో సలహాలు, సూచనలు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆ ముగ్గురికీ వైద్య సేవలు స్వయంగా అందించారు. ఇద్దరు పిల్లలు ఒక మహిళ మొత్తంగా ముగ్గరి ప్రాణాలు కాపాడి వృత్తి పట్ల తనకున్న ఇష్టాన్ని చాటుకున్నారు. ఈ విషయం నియోజకవర్గంలో చర్చనీయంశమైంది, ఐదు సంవత్సరాలుగా వైద్య వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ సీదిరి అప్పలరాజు నేడు రాష్ట్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, ఆపద సమయంలో వెంటనే స్పందించి మూడు నిండు ప్రాణాలు కాపాడినందుకు, మళ్ళీ వైద్యుడుగా అవతారం ఎత్తినందుకు ప్రజలు మంత్రిని అభినందనల్లో ముంచెత్తారు.
Also Read : ఎమ్మెల్యే అనే పిలవండి: కొడాలి సూచన