Good Luck: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పార్టీ తరపున సామాజిక బాధ్యతగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామని వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ వి.విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నం, ఆంధ్రా యూనివర్సిటీలో రెండు రోజుల జాబ్‌మేళా ముగిసిన తర్వాత సర్ సీఆర్ రెడ్డి స్నాతకోత్సవ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలను యువతకు అనుసంధానం చేసి వారి అర్హత మేరకు ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
నిన్న తొలిరోజు 13,663 మంది ఉద్యోగాలు సంపాదించగా నేడు సాయంత్రం వరకు 8,554 ఉద్యోగాలు వచ్చాయని, మరికొన్ని ఇంటర్వ్యూలు ఇంకా జరుగుతున్నాయని వివరించారు, రెండు రోజులు కలిపి ఇప్పటివరకూ మొత్తం 22,217 ఉద్యోగాలు యువతకు అందించడం ద్వారా రికార్డు నెలకొల్పామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ జాబ్ మేళాలో ఒక వ్యక్తీ పొందిన గరిష్ట వార్షిక వేతనం రూ.12.50 లక్షలు కాగా, కనీస వేతనం నెలకు ఎక్కడా రూ.15వేలకు తగ్గలేదని చెప్పారు ‘విద్యార్థి దశ నుంచి బిందువులా మొదలయ్యే మీ ప్రస్థానం, భవిష్యత్తులో ఒక సెలయేరులా మారాలి. ఆ దిశలో మీరు ఎదగాలి’ అంటూ విజయసాయి ఆకాంక్షించారు.
జాబ్‌మేళాలో ఎక్కువగా యువతులకే ఉద్యోగాలు రావడం అనేది చాలా సంతోషకరమని, మహిళలకు ఆర్థిక స్వావలంబన రావాలని, ఆర్థికంగా వారికి పట్టు రావాలని అభిలషించారు. ఇవాళ మీకు వచ్చిన ఈ అవకాశం మీ తల్లిదండ్రుల ఆశీర్వాదబలం కాబట్టి మీ ఆనందాన్ని వారితో పంచుకొని, వారు మరింత గర్వించేలా ఎదగాలని హితవు పలికారు.
ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలకు ఎంపిక కాని వారు నిరుత్సాహపడొద్దని, ఆయా పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇప్పిస్తామని విజయసాయి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో నిర్వహించే జాబ్‌మేళాలో మీకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సహకారం ఇచ్చిన ఏయూ వీసీ స్టీఫెన్‌తో పాటు, ఇతర ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి వైయస్సార్‌సీపీ పక్షాన విజయసాయి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జాబ్ మేళాలో పాల్గొన్న 208 కంపెనీల అధినేతలకు, ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.