బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఈరోజు శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. అంతకు ముందు భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సభాపతి, దేవాలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
తెలంగాణ తిరుమలగా ఖ్యాతి గడించిన దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు గతంలో రూ. 13 కోట్లు మంజూరు చేశారని పోచారం గుర్తు చేశారు. ఈ నిధులతో దేవాలయానికి ప్రాకారం, రాజగోపురాలు, నూతన రధం, మాడ వీధులు, యజ్ఞశాల, నిత్య అన్నదాన సత్రం, కళ్యాణకట్ట, యాత్రికుల వసతి సముదాయం, వివాహ మండపం, కొండ మీదకి రెండు వరుసల రహదారి, పార్కింగ్ మరియు భక్తులకు అవసరమైన ఇతర వసతులను నిర్మిస్తున్నామని వెల్లడించారు.
పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని స్పీకర్ చెప్పారు.
నూతనంగా మంజూరైన బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సంవత్సరం నుండే క్లాసులు ప్రారంభం అవుతాయన్నారు. అదేవిధంగా బీర్కూర్ లోని BC రెసిడెన్షియల్ స్కూల్, కోటగిరి లోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలుకు నూతన భవనాల నిర్మాణం కోసం రూ. 5 కోట్లు చొప్పున మంజూరు అయ్యాయన్నారు.