తెలుగు వారి చరిత్ర తిరిగి చూస్తే ఓ వాస్తవం మన కళ్ల ముందు కనబడుతుంది. దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఇద్దరే మహానుభావులు చరిత్రలో నిలబడిపోయారు. మొదటి వ్యక్తి ఎన్టీఆర్, రెండో వ్యక్తి కేసీఆర్ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేశారు.. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని కూడా క్రియేట్ చేశారని కేటీఆర్ ప్రశంసించారు. అన్ని రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు. కానీ మన తెలంగాణకు రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది గొప్ప విషయమన్నారు. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసినప్పుడు కేసీఆర్‌ను ఉద్దేశించి ఒక మాట అన్నారు. జీవితంలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యాలు నిర్ణయించుకుంటారు. కానీ లక్ష్యాలను చేరుకోలేకపోతారు. కానీ మీరు ఆ లక్ష్యాన్ని జీవితకాంలోనే చేరుకున్నారు. మీరు ముఖ్యమంత్రి కూడా అయ్యారు.. మీ జీవితం ధన్యమైపోయిందని ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు.
కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ప్రభుత్వం కొలువుదీరింది. ఆ ప్రభుత్వంలో తనకు మంత్రి అవకాశం వచ్చింది. మంత్రిగా నాటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కూడా ఒకసారి కలిశాం. ఆయన ఒక మాట ఉన్నారు. భారతదేశంలో మంచి ఆందోళనకారులను చూశాం. పరిపాలకులను కూడా చేశాం. కానీ కేసీఆర్ లాంటి రేర్ వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నామని జైట్లీ చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ గుర్తు చేశారు.
భారతదేశానికే తెలంగాణ దిక్సూచి
తెలంగాణను భారతదేశానికే దిక్సూచిగా మార్చారు సీఎం కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. అవినీతి రహితంగా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఇవాళ తెలంగాణ ఆచరిస్తున్నది రేపు దేశం మొత్తం ఆచరించక తప్పదు అనే స్థాయికి తెలంగాణ చేరుకుంది. 75 ఏండ్ల స్వాతంత్ర్యంలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు ఆకుపచ్చ రుమాలు మెడలో వేసుకున్నవారే. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక రైతుబంధు అనే గొప్ప పథకం ప్రవేశపెట్టారు. మన రైతుబంధు కేంద్రానికి ప్రేరణ అయింది. మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టి మంచినీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. టీఎస్ ఐపాస్ అనే పథకాన్ని కాపీ కొట్టి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించారు. తెలంగాణలో మాత్రమే 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ కాలంలోనే పూర్తి చేశారు. నాలుగు దశాబ్దాల ఫ్లోరోసిస్‌ను.. నాలుగేళ్లలో ఆ సమస్యకు పరిష్కారం చూపారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read : బీజేపీ అంటే అమ్మకం…టీఆర్ఎస్ అంటే నమ్మకం