అమితాబ్ అంకుల్!
పాన్ మసాలా ప్రకటనలో మీరు చేయడం ఏంటి?
అబ్బే! అది యాలకుల ప్రకటన. జీర్ణశక్తికి మంచిదంటేనూ!
రణవీర్ సింగ్!
మీ మాట ఏంటి?
అదే, యాలకులు తింటే రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటామని అంతే!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సామాజిక సందేశాలివ్వడానికి ముందుండే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ కూడా యాలకుల ప్రకటనల్లో తరించి పోతున్నారు. ఐపీఎల్ సీజన్లో టీవీల ముందు కూర్చుంటే ఈ యాలకుల ప్రకటనలు విపరీతం. అసలు ఉన్నట్టుండి పాన్ మసాలా తయారీ దారులు యాలకుల ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారు?
భారత దేశంలో మద్యం తరవాత దాదాపు అంతపెద్ద పరిశ్రమ గుట్కా. సుమారు 40వేల కోట్ల విలువ. అయితే గుట్కా కారణంగా ఏటా కోటిమంది నోటి కాన్సర్ బారిన పడుతున్నారు. మన చట్టాలు బలహీనం. వీటి ప్రకటనలపై నిషేధం ఉంది. దాంతో సర్రోగసి ప్రకటనల్లోకి దిగారు. అంటే వేరే ఉత్పత్తులు. కానీ లోగో, ప్యాకింగ్ అన్నీ గుట్కా ప్యాకెట్ లానే ఉంటాయి. సెలబ్రిటీల ప్రకటనల ద్వారా సామాన్య జనాన్ని ఆకర్షించి, వారిద్వారా గుట్కా కొనిపించి, అలవాటు చేయడానికి ఎత్తుగడ ఇది. అడిగినంత డబ్బు ఇస్తారు. పైగా మారుమూలాలకు కూడా తమ ప్రాభవం పెంచుకోవచ్చని హీరోల ఆశ. రకరకాలుగా తమ తప్పు సమర్థించుకోవాలని చూస్తున్నారు. అజయ్ దేవగన్ అయితే ఆరోగ్యానికి చేటు చేసేవి అమ్మడం తప్పు కానప్పుడు ప్రకటనలో నటిస్తే తప్పేముంది అన్నట్టు మాట్లాడాడు. ఇదీ మన సెలెబ్రిటీల వరస. ఈ గుట్కా మాఫియా హాలీవుడ్ స్టార్ పియర్స్ బ్రోస్నాన్ ని కూడా మోసం చేసి ప్రకటనలో నటింపచేసింది. తరవాత తప్పు తెలుసుకుని లెంపలేసుకున్నాడు. అసలు ప్రజారోగ్యాన్ని హరించే ఉత్పత్తులను అనుమతిస్తూ వేలకోట్ల ధనం ఆవిరయ్యేలా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాలదే తప్పు. రాబడికోసం మద్యం, గుట్కా వ్యాపారాలపై ఆధారపడినంతకాలం పరిస్థితి ఇంతే! గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లలో పవిత్రమయినవి కూడా అమ్ముతారేమో ముందు ముందు. ఆ ప్రకటనల్లో పట్టుపంచెలు కట్టుకుని హీరోలు కనపడతారు. పవిత్రమైన పాన్ మసాలా ఆ విధంగా గడప గడపకు చేరుతుంది.
-కె. శోభ
Also Read :