వన్డే, టి-20లతో పాటు టెస్ట్ క్రికెట్ కూడా కలకాలం వర్ధిల్లాలని టీమిండియా టాప్ ఆర్డర్ బాట్స్ మ్యాన్ ఛటేశ్వర్ పుజారా ( Cheteshwar Pujara ) ఆకాంక్షించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడడం వ్యక్తిగతంగా తనకెంతో గర్వకారణమని పేర్కొన్నాడు. డబ్ల్యూటిసి ఫైనల్ అంటే వన్డే, టి-20 వరల్డ్ కప్ ఫైనల్ ఆటతో సమానమేనని అభిప్రాయపడ్డాడు.
గత కొంత కాలంగా ఇండియా జట్టు మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తూ వస్తోందని, ఫైనల్ లో కూడా అదే స్ఫూర్తి కొనసాగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. క్రికెట్ లో గొప్ప ఆటగాళ్ళు తయారుకావాలంటే, కలకాలం గుర్తుండే ఆటగాడిగా మిగలాలంటే టెస్ట్ క్రికెట్ మనుగడ సాగించాల్సిందేనని స్పష్టంగా చెప్పాడు. ఇకపై ప్రపంచంలో టెస్ట్ క్రికెట్ ఆడే ఏ జట్టు అయినా ప్రతి మ్యాచ్ నూ సీరియస్ గా తీసుకుని ఆడతారని… డబ్ల్యూటిసి ఈ దిశలో ఎంతగానో ఉపకరిస్తుందన్నాడు. ఈ వారంలో జరగబోయే ఫైనల్ లో భారత జట్టు గెలిస్తే ఎంతోమంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు అది స్ఫూర్తి ఇస్తుందని, తద్వారా వారు టెస్ట్ మ్యాచ్ లపై కూడా ఆసక్తి పెంచుకుంటారని, తర్వాత జరగబోయే డబ్ల్యూటిసి నాటికి వారు మరింత రాటుదేలతారని వివరించాడు.
ప్రాక్టిసు, వామప్ మ్యాచ్ లు ఆడకపోవడం ఇబ్బందికరమే అయినా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కోవిడ్ సంక్షోభ సమయంలో పరిస్థితులు మన చేతుల్లో లేవని పుజారా వ్యాఖ్యానించాడు. అయితే ఛాలెంజ్ ఎదుర్కొంటున్నప్పుడు లక్ష్యంవైపే దృష్టి కేంద్రీకరించి ఆడతామని చెప్పాడు.
కాగా, పుజారా ఆటతీరుపై క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రసంశల జల్లు కురిపించాడు, టి-20 మ్యాచ్ లు చూడడానికి అలవాటు పడ్డ వారికి, ప్రతి బంతినీ గ్రౌండ్ బైటకు పంపాలనే మనస్తత్వానికి టెస్ట్ క్రికెట్ అంతగా నచ్చడం లేదని, ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. పుజారా గత కొంత కాలంగా టెస్ట్ క్రికెట్ కు అందిస్తున్న సేవలు అసమానమైనవని సచిన్ కొనియాడారు.
Also Read : సాధన మొదలుపెట్టిన టీం ఇండియా