Counter: తెలంగాణ మంత్రి కేటియార్ ఏపీ గురించి మాట్లాడి ఉంటారని తాను అనుకోవడంలేదని, ఒక వేళ మాట్లాడి ఉంటే రోజూ నాలుగు బస్సులు కాదని, 40 బస్సులు పంపొచ్చని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. అయినా, ప్రతిరోజూ తెలంగాణా నుంచి 400 ఆర్టీసీ బస్సులు వస్తున్నాయని, దానిలోనైనా పంపొచ్చని చెప్పారు. ఏపీలో రోడ్లు, కరెంట్, నీళ్ళ సమస్యలపై తెలంగాణా మంత్రి కేటియార్ చేసిన వ్యాఖ్యలపై అమర్నాథ్ స్పందించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలని, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎలాంటి పనులు చేస్తున్నామో చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ప్రభుత్వం వద్ద ఎలాంటి పని కావాలన్నా వారి ఇంటి దగ్గరే చేసిపెట్టే గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా పరిశీలించాలని కోరారు. రాష్ట్రం అంటే ఒక నగరం మాత్రమే కాదన్న విషయాన్ని తెలుసుకోవాలని కేటిఆర్ కు అమర్నాథ్ హితవు పలికారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనలో భాగంగా తాము నెలకొల్పిన సరికొత్త వ్యవస్థలను, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను ఒక్కసారి ఇక్కడకు వచ్చి తెలుసుకోవాలన్నారు. దేశంలో 16 రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయన్నారు, ఇది తాత్కాలిక సమస్య అని, త్వరలోనే దీన్ని అధిగమిస్తామని చెప్పారు. సభలో ఉన్నవారిని ఆకట్టుకోడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
తమ రాష్ట్రానికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, కొత్తగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం మొదలు పెట్టామని పేర్కొన్నారు. సిఎం జగన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం మే నెలలో దావోస్ పర్యటనకు వెళ్తోందని, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
Also Read : కేటియార్ వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం