Orange Alert : తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ పరిస్థితులు నెలకొన్నాయి. మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, అప్రమ్తతంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల గరిష్టంగా 47 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రంలో వడగాడ్పులు, తీవ్ర ఉక్కపోతతో జనం కుతకుతలాడుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోతగా ఉంటుండటంతో ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా మే నెల మధ్యలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుతాయి. కానీ నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి.
రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని.. ఇదే పరిస్థితి ఇంకొన్నిరోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.
చెదురుముదురు వర్షాలు
ఇక తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రెండు మూడు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయాచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వివరించింది.
Also Read : కాంగోలో విస్తరిస్తున్న ఎబోలా