Tuesday, September 24, 2024
HomeTrending Newsసీఎస్‌ సోమేశ్‌ కు బిగుస్తున్న ఉచ్చు

సీఎస్‌ సోమేశ్‌ కు బిగుస్తున్న ఉచ్చు

Ramakrishna Rao : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేష్ కుమార్ బ‌దిలీకి రంగం సిద్ధమైంది. ఒక‌టి రెండు రోజుల్లో సీఎస్ సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణ‌ ప్రభుత్వం బ‌దిలీ చేసే అవ‌కాశం ఉంది. ఇందులో భాగంగానే సీఎస్ సోమేశ్‌ కుమార్ గ‌త రెండు మూడు రోజులుగా తాత్కాలిక స‌చివాల‌యంలోని ఆయ‌న చాంబ‌ర్‌లోకి కూడా రావ‌డం లేదు.

కొత్త సీఎస్‌గా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఫైనాన్స్ కార్యద‌ర్శి అయిన రామ‌కృష్ణారావును నియ‌మించే అవ‌కాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ స‌చివాల‌యంలో ఏ నోట విన్నా ఇప్పుడు ఇదే మాట విన‌బ‌డుతోంది. ఏ న‌లుగురు క‌లిసినా.. సీఎస్ సోమేశ్‌ బ‌దిలీపైనే చ‌ర్చ జ‌రుగుతుంది. అతి త్వర‌లోనే కొత్త సీఎస్ నియామ‌కం జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా చ‌ర్యలు తీసుకుంటుందనేది న‌ర్మగ‌ర్భమ‌నే చెప్పాలి.

కార‌ణాలు ఇవేనా..?

క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న చందంగా సీఎస్ సోమేశ్‌ కుమార్ బ‌దిలీకి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని స‌చివాల‌య వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. సీఎస్ సోమేశ్‌ కుమార్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌లో ప్రధాన‌మైన‌వి కొన్ని..

1. ఇటీవ‌ల తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో గ‌త శనివారం నిర్వహించిన సదస్సులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సీఎస్ తీరును వివరించారు

సీఎం కేసీఆర్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో ఇటీవల తను సమావేశమైనప్పుడు న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు సమస్యలను వారికి వివరించానని, అయితే వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి.. రెండు రోజుల్లో పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించారని చెప్పిన‌ప్పటికీ.. నేటి వ‌ర‌కు సీఎస్ నుంచి సరైన స్పందన లేదని హైకోర్టు.. సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే కలిసి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్ పెండింగ్‌లో పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్ర జ్యుడిషియల్ అథారిటీలో సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని భాగస్వామిగా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అదే స‌భ‌లో సీజేఐకి సూచించ‌డంతో.. స్పందించిన సీజేఐ జ‌స్టిస్ ఎన్.వి.రమణ ‘తెలంగాణ ప్రధాన కార్యదర్శి తీరు మీరు విన్నారుగా’ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశాలకు రారని, వచ్చినా నిర్ణయాలు అమలు చేయరని వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ సీఎస్ వ్యవ‌హారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినా.. ఆ రాష్ట్ర సీఎస్ వినిపించుకోరా అని దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంలో సీఎస్‌పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన‌ట్లు స‌మాచారం.

2. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ‌లు చేస్తున్న ధ‌ర‌ణిలో లోపాల‌ను స‌రి చేయాల‌ని ప్రజ‌ల నుంచి ప్రభుత్వానికి ల‌క్షల ఆర్జీలు వ‌స్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం గ‌త 6 నెల‌ల కింద‌ట మంత్రి హ‌రీష్ రావు నేతృత్వంలో క్యాబినెట్ స‌బ్ క‌మిటీని నియ‌మించింది. అయితే ప‌లు ద‌ఫాలుగా స‌మావేశ‌మై చ‌ర్చించిన క్యాబినెట్ స‌బ్ క‌మిటీ ధ‌ర‌ణిలో ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని సూచించింది.
అయితే ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి హోదాతో పాటు రెవెన్యూ ముఖ్య కార్యద‌ర్శిగా, రెవెన్యూ కార్యద‌ర్శిగా, సీసీఎల్ఏ క‌మిష‌నర్‌గా, స్టాంపులు, రిజిస్ర్టేష‌న్‌ల శాఖ ఐజీగా శేషాద్రి ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయి పర్యవేక్షకుడిగా మాత్రం సీఎస్ ఉన్నారు. ఈ క్రమంలోనే ధ‌ర‌ణిలో ఈ లోపాల స‌వ‌ర‌ణ‌కు సీఎస్ సోమేశ్‌ కుమార్ అనుమ‌తి త‌ప్పనిస‌రి. అందుకు కొత్త మాడ్యూల్‌ల‌ను ప్రవేశ‌పెట్టాలని సూచించారు.

కానీ సీఎస్ సోమేశ్‌ కుమార్ ధ‌ర‌ణిలో స‌వ‌ర‌ణ‌ల అంశాన్ని ప‌క్కన పెట్టారనే అప‌వాదు ఉంది. దీంతో గ‌త ఏడాదిన్నర కాలంగా ల‌క్షల సంఖ్యలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధ‌ర‌ణి మేలు కంటే కీడు ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. ధ‌ర‌ణి విష‌యంలోను సీఎస్ సోమేశ్‌ కుమార్ వ్యవ‌హారంపై సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.
3. వీఆర్ఏల‌ డిమాండ్ మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల‌కు పే స్కేల్ ఇస్తామ‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంద‌ర్భాల్లో ప్రక‌టించ‌డంతో పాటు ఇటీవ‌ల జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశాల్లోను అసెంబ్లీ సాక్షిగా ప్రక‌టించారు. అలాగే వీఆర్ఏల‌లో కొంద‌రిని ల‌ష్కర్‌లుగా నియ‌మిస్తామ‌ని, వీఆర్ఓల‌ను ఇత‌ర శాఖ‌ల‌లో విలీనం చేస్తామ‌ని, కొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు వ‌స్తాయ‌ని సీఎం కేసీఆర్‌ ప్రక‌టించారు. కానీ నేటి వ‌ర‌కు అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువ‌డ లేదు. స‌చివాల‌యంలోని రెవెన్యూ విభాగం అధికారులు, ఫైనాన్స్ క్లియ‌రెన్స్ వ‌చ్చినా.. ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్‌ కుమార్ అందుకు సంబంధించిన ఫైల్ ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోపణ‌లు ఉన్నాయి. సీఎస్ తొంద‌ర‌గా నిర్ణయం తీసుకోని కార‌ణంగానే వీఆర్ఏలు, వీఆర్ఓలు ప్రభుత్వానికి వ్యతిరేఖం అయ్యార‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు స‌మాచారం.
4. ప్రభుత్వ ప‌రిపాల‌నకు సంబంధించిన అనేక ముఖ్య విభాగాల‌లో సీఎస్ సోమేశ్‌ కుమార్ త‌న అనుయాయుల‌కు, ముఖ్యంగా త‌న సొంత రాష్ట్రమైన బిహారీ ఐఏఎస్‌ల‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నార‌నే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే ప‌లు కీల‌క శాఖ‌ల‌లో బీహార్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల‌ను నియ‌మించార‌ని, ఆ అధికారుల గురించి గొప్పగా చెప్పి కేసీఆర్‌ను కూడా ఒప్పించార‌ని సోమేశ్‌ కుమార్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

5. సీఎస్ సోమేశ్‌ కుమార్ ప్రజ‌ల ఇబ్బందుల‌పై చ‌ర్చించేందుకు వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు కూడా క‌నీసం అపాయింట్‌మెంట్ ఇవ్వడ‌నే ఆరోప‌ణ ఉంది. సీఎం అండ ఉంద‌నే కార‌ణంతో సీఎస్‌తో గ‌ట్టిగా మాట్లడేందుకు అధికార పార్టీ మంత్రులు కూడా సాహ‌సించేవారు కాద‌ట‌. ఈ క్రమంలోనే సీఎస్ సోమేశ్‌ కుమార్ త‌న‌కు ఎదురే లేదు అన్నట్లుగా విర్రవీగుతాడనే అప‌వాదు ఆయ‌న‌పై ఉంది.

6. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు ఇవ్వాల‌నే ప్రతిపాద‌న సోమేశ్‌ కుమార్‌ చేసిందేన‌ని ఐఏఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ. ప్రతి వ‌ర‌ద బాధితుడి కుటుంబానికి రూ.10వేలు ఇవ్వడం వ‌ల‌న టీఆర్ఎస్‌కు ఎన్నిక‌ల్లో మేలు జ‌రుగుతుంద‌ని స‌ల‌హా ఇచ్చింది కూడా ఆయ‌నే అని నేటికి చాలా మంది అంటుంటారు. కానీ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కొంప ముంచింది ఆ రూ.10వేల పంచాయితీలేన‌ని జీహెచ్ఎంసీ ఫ‌లితాల త‌రువాత సాక్షాత్తు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జ‌రిగింది.

7. అర్హత లేకున్నా ఓ యువ ఐఏఎస్ అధికారిని సీసీఎల్ఏలో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి అనేక భూ వివాదాల‌ను సెటిల్ చేశార‌ని గ‌తంలో ప్రచారం జ‌రిగింది. అది ఎంత వ‌ర‌కు నిజం అనేది తెలియ‌దు. ప్రభుత్వం తెలుసుకునే ప్రయ‌త్నం కూడా చేయ‌లేదు. కానీ ఆ అధికారిని మాత్రం ఉన్నత చ‌దువుల పేరుతో అక్కడి నుంచి తొంద‌ర‌గానే బ‌దిలీ చేశారు.
8. ప్రజలకు సంబధించిన సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పరిపాలన పరమైన నిర్ణయాలలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సోమేశ్‌ కుమార్‌పై హైకోర్టులో సుమారు 450 పైచిలకు రిట్‌ పిటీషన్లు దాఖలు అయ్యాయి. దేశంలో ఏ సీఎస్‌పై కూడా ఇన్ని రిట్‌లు నమోదు కాలేదని హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు న్యాయవాదులు పిచ్చపాటిగా చర్చించుకోవడం కనిపిస్తుంది. కార‌ణం తెలియ‌దు గానీ రాజీవ్ శ‌ర్మ త‌రువాత సోమేశ్‌ కుమార్ ఎంత చెబితే అంతే.. అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవ‌హ‌రించే వార‌ని అనేక మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు బాహాటంగానే ఆరోప‌ణ‌లు చేశారు. సోమేశ్‌ కుమార్‌ జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఉన్న సమ‌యంలోను ప్రభుత్వంలో ఆయ‌న కీల‌కంగా వ్యవ‌హారించేవారనేది బ‌హిరంగ ర‌హ‌స్యం.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప‌రిధిలో అమ‌లు జ‌రుగుతున్న ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కూడా సోమేశ్‌ ఆలోచ‌నే అంటుంటారు. కారణం తెలియదు కానీ గతంలోను ఒక్కసారి సీఎం కేసీఆర్ సోమేశ్‌కుమార్‌ను దూరం పెట్టాడని ఈసారి పూర్తిగా దూరం పెట్టే యోచనలో ఉన్నట్లు గ్రామ‌ స‌చివాల‌యం నుంచి రాష్ట్ర స‌చివాల‌యం వ‌ర‌కు ప్రచారం జ‌రుగుతున్నది.

అయితే ఈ విష‌యాన్ని సీఎం అధికారిక నివాసం ప్రగ‌తి భ‌వ‌న్ వ‌ర్గాల్లో కొంద‌రు ధృవీక‌రిస్తున్నప్పటికీ.. మరి కొంతమంది అధికారులు మాత్రం నిజం కాక‌పోవ‌చ్చు అనే స‌మాధానమిచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ సాగుతున్నట్లుగా.. సీఎస్ సోమేశ్‌ కుమార్‌ను బ‌దిలీ చేస్తారా.. లేదా అనేది మాత్రం కేసీఆర్‌కే ఎరుక‌.

రానున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో సోమేశ్‌ కుమార్‌ నిర్ణయాలతో పెళ్లుబీకుతున్న వ్యతిరేకతను సీఎం కేసీఆర్‌ గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు అధికారిక, రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

నూత‌న సీఎస్‌గా ప్రచారం జ‌రుగుతున్నసీనియ‌ర్ ఐఏఎస్ అధికారి రామ‌కృష్ణారావు సాక్షాత్తు కేసీఆర్ సామాజికవ‌ర్గం కావ‌డంతో పాటు మొద‌టి నుంచి కేసీఆర్‌కు నమ్మిన వ్యక్తి. ఈ క్రమంలోనే సీఎస్‌గా ఆయ‌న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మ‌రికొద్ది సమయం వేచిచూస్తే త‌ప్ప దీనిపై స్పష్టత వ‌చ్చే అవ‌కాశం లేదు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్