Vidya Deevena: విద్యార్థుల ఫీజు రీఇంబర్స్ మెంట్ మొత్తాన్ని నాలుగు విడతల్లో ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ద్వారా అందిస్తున్న ప్రభుత్వం ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన తరువాత చెల్లిస్తోంది. జనవరి-మార్చి, 2022 త్రైమాసికానికి దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు709 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గురువారం తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
గత ప్రభుత్వం బకాయి పడిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ రూ. 1,778 కోట్లతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం రూ. 10,994 కోట్లు.
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ప్రభుత్వం ఎలాంటి పరిమితులూ విధించలేదు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తోంది ప్రభుత్వం.
రేపు తిరుపతిలో సిఎం వైఎస్ జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వీ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్‌వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో సంభాషణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి టాటా కేన్సర్ కేర్ సెంటర్ ( శ్రీ వెంకటేశ్వర ఇన్ట్సిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ హాస్పిటల్) కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం 2.25 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.