No copying: పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన 5 పరీక్షల్లో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని, పేపర్లు లీక్ కాలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పరీక్షలు మొదలైన తర్వాత మాత్రమే కొందరు స్వార్థంతో, స్వప్రయోజనాలు ఆశించి, ప్రలోభాలకు లొంగి, ప్రభుత్వంపై నింద వేయడం కోసం పేపర్లు ఫోటో తీశారని వెల్లడించారు. ఈ అంశాన్ని ప్రభుత్వానికి అంటగట్టి కొందరు విమర్శలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్‌లో బొత్స మీడియా సమావేశంలో మాట్లాడారు.
బొత్స ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు
టెన్త్ ప్రశ్నపత్రాలు లీక్ కాలేదు. మాస్ కాపీయింగ్ లేదు
ఒకటి రెండు చోట్ల పరీక్షలు మొదలయ్యాక ఫోటోలు తీశారు
దీనికి సంబంధించి ఇప్పటికే 60 మందిని అరెస్ట్ చేశాం
గతంలో లేని విధంగా క్రిమినల్ కేసులు నమోదు చేశాం
అరెస్టు చేసిన వారిలో ప్రైవేటు విద్యాసంస్థల వారు 22 మంది
వారిలో నారాయణ సంస్థ వైస్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు
మిగిలిన వారిలో 36 మంది టీచర్లు. మరో ఇద్దరు సిబ్బంది
అయినా విపక్షం దుష్ప్రచారం, అనవసర రాద్దాంతం చేస్తోంది
అర్ధం లేకుండా రాజీనామా డిమాండ్ చేస్తున్నారు
గతంలో యథేచ్ఛగా ప్రశ్నపత్రాల లీకేజ్‌లు జరిగాయి
చాలా చోట్ల మాస్ కాపీయింగ్‌లూ కొనసాగాయి
అయినా ఎవ్వరిపైనా ఎలాంటి చర్యలు లేవు
దుష్ప్రచారంతో విద్యార్థులు మనోస్థైర్యం దెబ్బతీయొద్దు
వారి తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టొద్దు
ఈనాడులో ఇవాళ ఒక అసత్య కధనం. అంతా వక్రభాష్యం
నూటికి నూరు శాతం రిజల్ట్స్ రావాలని మేం చెప్పలేదు
స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెరగాలని నిర్దేశించాం
ఆ మేరకు ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మారుస్తున్నాం
దుష్ప్రచారంతో 6 లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు