మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఓ యువకుడిని మావోయిస్టులు ఇన్‌పార్మర్ ఆరోపణలతో హత్య చేశారు. ఎటపల్లి తాలూకా హవేరా పోలిస్ స్టేషన్ పరిధిలో మద్రీ వద్ద రాంజీ దాస్ అరోమ అనే గిరిజన యువకుడిని మావోయిస్టులు హతమార్చి మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. అతని తల, పొత్తికడుపు భాగంలో అతిదారుణంగా కత్తులతో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. మృతదేహం ప్రక్కన మావోయిస్టులు ఒక లేఖను వదిలి వెళ్లారు. ఆ లేఖలో రాంజీ 2010లో మావోయిస్ట్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయి తదుపరి ఇన్ఫార్మర్‌గా మారి పనిచేస్తున్నాడని, అందుకే శిక్షించినట్లు పేర్కొన్నారు. పోలీసు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తే ఎవరికైనా ఇదేగతి పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ హత్యతో ఆ ప్రాంతమంతా భయాందోళన వాతావరణం నెలకొంది. రాంజీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తెలంగాణలోని మంచిర్యాల్ జిల్లాకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే గిరిజనుడి హత్య జరగటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలపై నిఘా పెంచారు. గిరిజనుడి హత్యతో సరిహద్దుల్లోని గ్రామాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
Also Read : పోలీసు క్యాంపుపై మావోల మెరుపు దాడి