Great Initiative: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును గ్రీన్ కో సంస్థ ఏర్పాటు చేయడం సంతోషమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం, బ్రాహ్మణపల్లి పంచాయతీ, గుమ్మటం తండా వద్ద 5230 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో గ్రీన్ కో నెలకొల్పుతోన్న సమీకృత విద్యుత్ ప్రాజెక్టుకు జగన్ శంఖుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో అయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా అతి తక్కువ ధరలో నాణ్యమైన, నిరంరత విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. హైడల్, విండ్, సోలార్ లాంటి మూడు విద్యుత్ లను ఉత్పత్తి చేస్తూ పీక్ అవర్స్ లో విండ్, సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తూ హైడల్ నుంచి నీటిని రిజర్వాయర్లకు వెనక్కు పంపిస్తూ వాటిని మళ్ళీ ఉపయోగించుకునేలా ఏర్పాటు ఉంటుందని వివరించారు.
నేడు మొదలు పెడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం యావత్ దేశానికే ఆదర్శంగా, నమూనా ప్రాజెక్ట్ గా నిలుస్తుందని సిఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల (Fossil fuels) వినియోగం తగ్గి, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని వెల్లడించారు. మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చిన గ్రీన్ కో సంస్థ అధినేత చలమశెట్టి అనిల్, కంపెనీ డైరెక్టర్లను సిఎం అభినందించారు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో, గ్రీన్ ఎనర్జీ లో ఇదో గొప్పమలుపు అవుతుందని, దేశానికే ఓ దిక్సూచిగా నిలుస్తుందని సిఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫునుంచి ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి సహకారం కావాలన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని సిఎం భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీలు సంజీవ్ కుమార్, పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, కంగాటి శ్రీదేవి, సాయి ప్రసాద రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read : ఒక్కరినైనా చూపించారా? జగన్ సవాల్