వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ పై పబ్లిక్ సెషన్ లో ముఖ్యమంత్రి YS జగనమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ వివిధ అంశాల్ని ప్రస్తావించారు.
సీఎం ఏమన్నారంటే..:
కోవిడ్ లాంటి విపత్తను ఎవ్వరు కూడా ఊహించలేదు. మన తరంలో కనీసం ఎప్పుడూ చూడని విపత్తు ఇది. వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ లాంటి విపత్తు మరోసారి వస్తే దాన్ని నివారించడానికి బలీయమైన వ్యవస్ధ కావాలి. కోవిడ్ విపత్తు నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. నివారణ, నియంత్రణ చికిత్స విధానాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. మరోవైపు సమగ్రమైన ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. అది అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
కోవిడ్, తదనంతర అంశాలన్నీ మనకు కనువిప్పులాంటివి. ఒక దేశం, ఒక రాష్ట్రం పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతా చేశాం. కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌పై దృష్టి పెట్టింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. మా రాష్ట్రం అత్యాధునిక మల్టీస్పెషాలిటీ వైద్య సేవలు విషయంలో వెనుకబడి ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడమే దీనికి ప్రధాన కారణం. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి టయర్ –1 నగరాలు ఏపీలో లేనందున.. ప్రైవేటు సెక్టార్‌లో ఆత్యాధునిక వైద్య సేవల లభ్యత తక్కువగా ఉంది. కోవిడ్ సమయంలో ప్రధానమైన ఈ లోపాన్ని మేము ముందే గుర్తించాం. కోవిడ్ నియంత్రణలో భాగంగా 44 దఫాలుగా ఇంటింటికీ సర్వే నిర్వహించాం. మా రాష్ట్రంలో దీనికోసం బలమైన వ్యవస్ధను రూపొందించాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో పాటు 42 వేల మంది ఆశావర్కర్లు కూడా వైద్య, ఆరోగ్యరంగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. వీరందరిని సమిష్టి చేసి… ఇంటింటికీ సర్వే చేస్తూ… తగిన చర్యలు తీసుకుంటూ కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగాం. ఫలితంగా మరణాల రేటును కూడా తగ్గించగలిగాం. ఇండియాలో నమోదైన సగటు మరణాల శాతం 1.21 ఉంటే.. ఏపీలో దేశంలోనే అత్యల్పంగా 0.63 శాతం నమోదైంది.
కోవిడ్ లాంటి పాండమిక్‌లు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. ఒకటి నివారణ, రెండోది నియంత్రణ చికిత్స. వైద్య, ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయాలంటే.. అవైలబులిటీ, యాక్సెస్‌బులిటీ, ఎఫర్ట్‌బులిటీ ఈ మూడు సమాంతరంగా అందుబాటులోకి రావాలి.
ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో 2వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 2 ప్రై మరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు చొప్పున నలుగురు వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడికి 104 వాహనాన్ని కేటాయిస్తారు. ఒక్కో వైద్యుడికి మండలంలో 4–5 గ్రామాలను కేటాయిస్తారు. వీళ్లు రోజు తప్పించి రోజు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఆ గ్రామాల్లో ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా సేవలు అందిస్తారు. తద్వారా ఆ గ్రామాల్లో ప్రజలను పేరు, పేరునా పలకరిస్తూ వారికి సేవలు అందించడంతో పాటు విలేజ్ క్లినిక్‌ను మెడికల్ హబ్‌గా ఉపయోగిస్తారు. ఇందులో ఏఎన్‌యమ్, నర్సింగ్ గ్రాడ్యుయేట్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీస్‌నర్, ఆశా వర్కర్లు ఉంటారు. వీళ్లంతా నివారణ చర్యల్లో చురుగ్గా పాల్గొంటారు.
ఇక నియంత్రణ చర్యల విషయానికొస్తే… జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి.
ప్రతి పార్లమెంటును యూనిట్‌గా తీసుకుని మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపడుతున్నాం. దీని వల్ల అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలు సమానంగా అందించాలన్నదే లక్ష్యం. మెడికల్ కాలేజీల ఏర్పాటు చేసినప్పుడే… పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు. అప్పుడే ఆ మెడికల్ కాలేజీలను అనుసంధానం చేయడం సాధ్యమవుతుంది.అప్పుడే మేం ఎదురుచూస్తున్న అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుంది.
మూడేళ్ల కాలపరిమితిని విధించుకున్నాం. ఈ మొత్తం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మూడేళ్లలో రూ.16వేల కోట్ల సమీకరణ చేయాలని నిర్దేశించుకున్నాం. అందులో భాగంగా మేం సరైన దిశలోనే వెళ్తునాం. కచ్చితంగా అనుకున్నది చేసి చూపిస్తాం. వైద్యుల లభ్యత విషయానికొస్తే… దీనికోసమే మరిన్ని మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉండగా.. మరో 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఒక క్రమపద్ధతిలో మెడికల్ కాలేజీ, ఆసుపత్రుల నిర్మాణాలను చేపడుతున్నాం. దీని వల్ల హెల్త్ సెక్టార్‌లో మరింతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అందుబాటులోకి వస్తారు.
హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికి వస్తే… ప్రధాని నరేంద్రమోదీ ఇండియాలో ఆయుష్మాన్‌భారత్ పథకం ప్రవేశపెట్టారు. దాదాపు వేయి చికిత్సావిధనాలు (ప్రొసిడ్యూర్స్) ఇందులో కవర్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మేము ప్రత్యేకంగా మా తండ్రిగారు పేరుమీద వైయస్సార్‌ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టాం. ఏపీలో 2446 వరకూ చికిత్సలను వీటికింద అందిస్తున్నాం. 1.44 కోట్ల ఇళ్లకి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పంపిణీ చేశాం. ఈ కార్డుకు అర్హతగా లబ్ధిదారుల ఆదాయపరిమితిని కూడా రూ.5లక్షలు వరకు పెంచాం. అంటే రూ.5లక్షలలోపు ఆదాయమున్న ప్రతి ఒక్కరూ ఈ కార్డు పొందడానికి అర్హులే. రాష్ట్రంలో దాదాపుగా 1.53 కోట్లు కుటుంబాలు ఉంటే.. మేం 1.44 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చే శాం. ఇందులో గత మూడేళ్లుగా 25 లక్షల మంది ఉచితంగా చికిత్స తీసుకున్నారు.
Also Read : ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సిఎం జగన్