జమ్ముకశ్మీర్లో భారత బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. ముగ్గురు ముష్కరులు జైష్ ఏ మహమ్మద్ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. బారాముల్లా సమీపంలోని క్రీరి ప్రాంతంలోని నజిభట్ క్రాసింగ్ వద్ద ఈ రోజు ఉదయం భద్రతా బలగాలకు – ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కశ్మీర్ కు చెందిన ఒక పోలీసు అధికారి కూడా చనిపోయారని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెల్లడించారు.
మృతుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కశ్మీర్ లో సుమారు 60 మంది ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్ తో పాటు సరిహద్దుల్లోని అన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 22 మంది టెర్రరిస్ట్ లను మట్టుపెట్టినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.