ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్త్రివాల్ ఇతర మంత్రులు పాల్గొన్నారు. అనిల్ బైజల్ ఎల్జీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఆయన స్థానంలో వినయ్ కుమార్ సక్సేనాను తదుపరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా బైజల్ మే 18న లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.
సక్సేనా ప్రొఫైల్:
1958 మార్చి 23న జన్మించిన సక్సేనా ఇటీవలి వరకూ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. కాన్పూర్ యూనివర్సిటీలో చదువుకున్న సక్సేనాకు పైలట్ లైసెన్స్ ఉంది. 2021 మార్చి 5న ఆయన్ను 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వార్షికోత్సవ వేడుకల జాతీయ కమిటీ సభ్యుల్లో ఒకడిగా నియమించారు. 2021 పద్మ పురస్కారాల ఎంపిక ప్యానెల్ సభ్యుడిగానూ ఆయన 2020 నవంబర్‌లో నామినేట్ అయ్యారు.
1984లో రాజస్థాన్‌లోని జేకే గ్రూపులో అసిస్టెంట్ ఆఫీసర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. ఆ గ్రూపులోని వైట్ సిమెంట్ ఫ్యాక్టరీలో పదకొండేళ్లపాటు వివిధ హోదాల్లో ఆయన పని చేశారు.
1991లో అహ్మదాబాద్ కేంద్రంగా సక్సేనా నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ (NCCL) అనే ఎన్జీవోను స్థాపించారు. ఈ సంస్థను న్యాయ శాఖ గుర్తించింది.
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌దే హవా:
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలోని బీజేపీ మధ్య జరుగుతున్న పోరులో లెఫ్టినెంట్ గవర్నర్‌దే కీలక పాత్ర. ఆయన చుట్టూనే ఢిల్లీ రాజకీయాలు తిరిగేవి. కానీ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయనే విషయమై 2018లో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది.