Samajika Nyaya Bheri: శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టిన సామాజిక న్యాయభేరితో చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఐ అండ్ పీ ఆర్ శాఖల మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వ్యాఖ్యానించారు. దారి పొడవునా ప్రజలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారన్నారు. సామాజిక విప్లవానికి పోరాటం చేసిన ఎందరో మహనీయుల స్పూర్తిగా నేడు సిఎం జగన్ సంక్షేమ, అభివృద్ధి ఫలాల్లో, పదవుల్లో దాన్ని నిజం చేసి చూపించారని కొనియాడారు. మహానాడు అబద్ధాల ఏడుపునాడు గా మిగిలిపోయిందని విమర్శించారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర నరసరావు పేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వేణుగోపాల కృష్ణ తో పాటు మంత్రులు ప్రసంగించారు. పల్నాడులో ప్రజల ఉత్సాహం చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ సిఎం జగన్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని, ‘జగనన్న ముద్దు- బాబు అసలు వద్దు’ అనే నినాదం ఇస్తున్నామన్నారు.
ప్రజలందరి ఆశీర్వాదాలతో గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని, ఈ మూడేళ్ళలో ఏ దిశవైపు ప్రభుత్వం పనిచేసిందో ప్రజలు ఆలోచించాలని సీనియర్ నేత, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. ప్రభుత్వ ఎలాంటి విధానాలను అనుసరిస్తుందో గమనించాలని, ఈ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కోసమే పనిచేస్తోందని చెప్పారు. చరిత్ర మొదట్లో కేవలం నాలుగు వర్ణాలుగా మాత్రమే ఉన్న సమాజంలో.. అంతరాలు పోవాలని, ప్రజలందరికీ సమాన గౌరవం దక్కాలని ఎందరో మహనీయులు పాటుపడ్డారని.. కానీ వారి ఆశలు నెరవేరలేదని… ఇన్నాళ్ళకు మన రాష్ట్రంలో సిఎం జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయం, రాజకీయం ప్రాతినిధ్యంతో అది సాధ్యపడిందని ధర్మాన వెల్లడించారు. ఇతర మంత్రులు కూడా తమ ప్రసంగాల్లో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకుప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, సామాజిక న్యాయాన్ని వివరించారు.