Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతాగి బండి నడిపితే...!

తాగి బండి నడిపితే…!

Will show u Movie: తాగడం, తాగుడు, తాగుబోతు లాంటి మాటల వ్యుత్పత్తి ప్రకారం చూస్తే అందులో నిందార్థం, నీచార్థం ఉండనే ఉండదు. నీళ్లయినా, మద్యమయినా తాగాల్సిందే. కానీ నీళ్లను ఎవరూ పుచ్చుకోరు. నీళ్లను ఎవరూ కొట్టరు. అదే మద్యం అయితే పుచ్చుకుంటారు. ఆ మద్యం మందుగా కొడతారు. బహుశా సీసా మూత తీయడానికి ముందు తట్టి, కొట్టి… ప్రారంభించడం వల్ల “మందు కొట్టడం” మాట పుట్టి ఉండాలి.

కొన్ని వేల మందు పార్టీల్లో కూర్చునే అవకాశం నాకు దొరికినా…ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యం “మందు” ఎలా అయ్యింది? ఆ మందును తాగకుండా కొట్టడం ఏమిటి? అని వ్యుత్పత్తి, ప్రతిపదార్థాలను అడిగే అవకాశం మాత్రం ఎవరూ ఇవ్వలేదు.  శుభమా అని మందు కొడుతుంటే… అశుభమయిన భాషాశాస్త్ర విషయాలు మొదలుపెడతావా? అని కొందరు నామీద ప్రేమతో బాటిల్ తో దాడి చేయబోయారు కూడా. ఆ మందు పార్టీల్లో ఫ్రూట్ జ్యూసులు తాగలేక, స్నాక్స్ తినలేక నేను బాధపడుతుంటే…వారు నన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతుంటారు. ఏ మాటకామాట. తాగిన తరువాత వారు వ్యక్త పరిచే అవ్యాజమయిన ప్రేమ ముందు ఈ ప్రపంచంలో ఏదయినా దూది పింజతో సమానం.

మాదక ద్రవ్యాలు, మద్యపానీయాలు యుగయుగాలుగా ఉన్నాయి. నేలకు అనకుండా గాల్లో తేలుతూ ఉండే రావణాసురుడి పుష్పక విమాన సువిశాల సౌధం బార్ కౌంటర్లో ఎన్ని రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఉండేవో లెక్కే లేదు. సురాపానానికి ఒక ఉదాత్తతను ఆపాదించిన కథలు కోకొల్లలు.

ఇప్పటి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సీరీస్…అన్నిట్లో “మద్యం ఆరోగ్యానికి హానికరం” అన్న స్టాచుటరీ హెచ్చరిక సాక్షిగా మద్యం ఏరులై పారుతూనే ఉంటుంది. చిన్నా పెద్ద, రాజు పేద, స్త్రీపురుష భేదం లేకుండా ఇప్పుడు సమాజం తాగడంలో సమానత్వాన్ని సాధించింది. ఇదొక మహా మద్యోదయం. ఇదొక మత్తోదయం.

ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మంచి నీళ్ల బడ్జెట్ కంటే మద్యం మీద ఖర్చు కనీసం మూడు రెట్లు అధికం. కొన్ని రాష్ట్రాలకు మద్యమే ప్రధానమయిన ఆదాయ వనరు. ఇందులో మంచి చెడ్డల గురించి మాట్లాడ్డం దండగ. మద్యం దానికదిగా ఒక పండగ.

మహా నగరాల్లో పగలు రాత్రి తాగేవారు తాగుతూ ఊగుతూ జోగుతూనే ఉంటారు. తాగి నడిపి ప్రమాదాలు చేసేవారు చేస్తూనే ఉంటారు. మధ్యలో అమాయకులు పోయేవారు పోతూనే ఉంటారు. ఉండేవారు తాగేవారు పెట్టే బాధలు భరించలేక ఎప్పుడు పోతారో తెలియక ఉంటూ ఉంటారు.

బాధలు మరచిపోవడానికి తాగేవారు; బాధ పెట్టడానికి తాగేవారు; బాధపడడానికి తాగేవారు; ఆనందం పట్టలేక తాగేవారు; ఆనందం కోసం తాగేవారు; మర్యాద కోసం తాగేవారు; మర్యాదగా తాగేవారు; అమర్యాదగా తాగేవారు; ఏమీ తోచక తాగేవారు, వ్యసనంగా తాగేవారు, ఎందుకు తాగుతున్నారో తెలియక తాగేవారు…ఇలా ఈ లిస్ట్ కు అంతులేదు.

వీకెండ్ తాగకపోతే గుండె ఆగిపోతుంది కాబట్టి గుండెను గౌరవించి ఎక్కువ మంది వీకెండే తాగుతూ ఉంటారు. దాంతో పోలీసులకు చెప్పుకోలేని సమస్యలు వచ్చి మీద పడుతున్నాయి. తాగి వాహనాలు నడపడం భారతీయ రవాణా చట్టాల ప్రకారం నేరం. డ్రంక్ అండ్ డ్రయివ్ లో దొరికిన మందుబాబులు, మందు భామలకు హైదరాబాద్ పోలీసులు ఎన్నో ఏళ్లుగా “సినిమా” చూపిస్తున్నారు.

Hyderabadtraffic Police

తాగి వాహనం నడిపిన వ్యక్తి…కుటుంబ సభ్యులతో పాటు వచ్చి , ఈ సినిమాను చూసి స్టాంప్ వేయించుకుని, ఆ పై కోర్టులో అపరాధ రుసుము కట్టి చలానా తీసుకుని బయటపడాలి. తాగి వాహనాలు నడిపితే జరిగే అనర్థాల మీద డాక్యుమెంటరీ సినిమాను వీరికోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. అలా ఒక వీకెండ్ తాగి బండ్లు నడిపిన మందుబాబులు తమ తమ కుటుంబాలతో పోలీసు సినిమా చూడడానికి బుద్ధిగా క్యూలో ఉన్న దృశ్యమిది.

ఆ క్యూలో ఎందరో కుటుంబసభ్యులు పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నారట. పెళ్లయిన మొదటి ఏడాది కలిసి వెళ్లడమే తప్ప…ఇంతవరకు ఒక సినిమా…ఒక అచ్చట… ఒక ముచ్చట ఏదీ లేదు. ఇచ్చట కుటుంబంతో సినిమా తప్పనిసరి కావడంతో ఆ ముచ్చట తీరుతోందట. మొల లోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం అంటే ఇదే!

భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ చాలా బలమయినది. తాగేవారి కుటుంబం కూడా కుటుంబమే. అలాంటి కుటుంబాలకు ఒక ఔటింగ్, ఒక సినిమా చూసే అవకాశాన్ని చట్టబద్ధంగా, నిర్బంధంగా ఇస్తున్న పోలీసుల అకౌంట్లో వద్దన్నా ఎంతో పుణ్యం వచ్చి పడుతూ ఉంటుంది.

కాకపొతే…ఒకే ఒక చిన్న సమస్య. ఇంతటి మహా నగరానికి, ఇన్ని లక్షల నిత్య డ్రంక్ అండ్ డ్రయివులకు, వారి సువిశాల కుటుంబాలు బంధు మిత్ర పరివారంగా రావడానికి తగినన్ని థియేటర్లను ఏర్పాటు చేయడంలో మాత్రం పోలీసులు ఇంకొంచెం ఉదారంగా ఉంటే…తప్పు కాదు!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

శబ్ద కాలుష్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్