Its unfair: విశాఖ మునిగిపోతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక సాక్షిగా కొందరు ప్రశ్నిస్తే తనకు కన్నీళ్లు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వరదలొస్తే విశాఖ మునిగిపోతుందని ఓ వర్గం మీడియా ఈ ప్రాంత ఇమేజ్ ను దెబ్బతీసిందని అంటూ… రాష్ట్రానికి, విశాఖకు హాని చేయొద్దు అని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి అమరనాథ్ విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఐటీ హబ్ గా, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఇమేజ్ ను దెబ్బతీస్తే సహించలేకపోయానని, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అలా అడిగిన సదరు ప్రతినిధికి ఇక్కడి వాస్తవ పరిస్థితులను వివరించడంతోపాటు, అటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, ఈ దుష్ప్రచారాన్ని దయచేసి ఇంకెవరికీ చెప్పవద్దని కోరానని వెల్లడించారు. విశాఖను యూనికార్న్ హబ్ గా తయారు చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు.
దావోస్ వెళ్ళింది, మా వ్యక్తిగత ప్రమోషన్ కోసం కాదని, అంతర్జాతీయ వేదిక మీద రాష్ట్రాన్ని ప్రమోట్ చేయటానికే వెళ్ళాం అన్నది అందరూ గుర్తెరగాలని మంత్రి కోరారు. విశాఖను యూనికార్న్ హబ్ గా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ గారి విజన్ అని, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఏపీ ప్రపంచానికే దిక్చూచి కాబోతుందని అన్నారు. డీకార్బనైజ్డ్ మెకానిజంలో ఆంధ్రప్రదేశ్ ఐకాన్ గా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మూడు ప్రధాన అంశాల మీద ఫోకస్ చేశామని, ప్రపంచస్థాయి వ్యక్తులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్లోబల్ లీడర్‌గా పాల్గొనారని తెలిపారు. హెల్త్ కు సంబంధించిన సదస్సులో తాను, విద్యకు సంబంధించిన సదస్సులో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నామన్నారు.
హుద్‌హుద్ తుపానును చూపించి, ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ ప్రాంతం ఇమేజ్‌ను కొంతమంది దెబ్బతీశారని, రాష్ట్రానికి మంత్రిగా, విశాఖ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఈ ప్రాంతానికి అటువంటి చెడ్డపేరు తీసుకుస్తే భరించే స్థితిలో మేము లేని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రిని పొడగమని తాము అడగటం లేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం కోసం దయచేసి రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి చెడు చేయవద్దని మీడియాకు మంత్రి విజ్ఞప్తి చేశారు. లోకేష్ కు ఏ సూటూ సూటు అవ్వదని, మాకు సూటు అయితే, దాన్ని చూసి ఏడవటం ఎందుకని, ఈ ఏడుపుగొట్టు రాజకీయాలు ఆపాలని హితవు పలికారు.
Also Read : ఎస్సీ గురుకులాలకు అదనపు హంగులు