Forest Protection: రాష్ట్రంలో ప్రజలకు అహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని అందించేందుకు నగర వనాలను మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో అటవీశాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 23 నగరవనాలు, 7 టెంపుల్ ఎకో పార్క్ లు ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్త నగరవనాలను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మొత్తం రూ.18.02 కోట్ల వ్యయంతో 220.48 ఎకరాల్లో ఈ నగరవనాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలోని మొత్తం 120కి పైగా అర్భన్ లోకల్ బాడీలు ఉన్నాయని, వాటి పరిధిలో కనీసం ఒక్కో నగరవనంను అయినా ఏర్పాటు చేయాలనేది అటవీశాఖ లక్ష్యంగా నిర్ధేశించామని తెలిపారు. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో అటవీశాఖ అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. నగరవనం, టెంపుల్ ఎకో పార్క్ ల కోసం ఈ ఏడాది 2022-23 లో 14.94 కోట్లు మేర రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు చేశామని, వాటికి తోడు కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగర వనాల్లో ఉదయపు నడక, పిక్ నిక్ స్పాట్ లుగా వినియోగించుకునేలా సదుపాయాలు కల్పించాలని అన్నారు. లోకల్ బాడీల పరిధిలో అయిదు కిలోమీటర్ల లోపు ఈ నగరవనాలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని, దీనిపై అటవీశాఖ ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ఎకో టూరిజం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పెద్దిరెడ్డి కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఎకో టూరిజం (వనవిహారి) ప్రాజెక్ట్స్ ఉన్నాయని, ఈ ఏడాది పులికాట్, నేలపట్టు, కోరంగి, పాపికొండలు ఎకో టూరిజం ప్రాజెక్ట్ లను అభివృద్ది చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు.
రాష్ట్రంలో 49,732 హెక్టార్ లలో ఎపి అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా వివిధ రకాల చెట్ల పెంపకం జరుగుతోందని, గత ఏడాది యూకలిప్టస్, టేకు ప్లాంటేషన్ 326.41 హెక్టార్ లలో చేయగా, ఈ ఏడాది 200 ఎకరాల్లో ప్లాంటేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే జీడిమామిడి తోటలకు సంబంధించి గత ఏడాది 5.50 హెక్టార్ లలో ప్లాంటేషన్ చేపట్టగా, ఈ ఏడాది 120 హెక్టార్ లలో చేయాలని, గత ఏడాది 15.73 లక్షల హెక్టార్ లలో వెదురు ప్లాంటేషన్ చేపట్టగా, ఈ ఏడాది 13.22 హెక్టార్ లలో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. గత ఏడాది 183 హెక్టార్ లలో కాఫీ ప్లాంటేషన్ చేపట్టగా ఈ ఏడాది 300 హెక్టార్ లలో చేయాలని, గత ఏడాది 34 హెక్టార్ లలో మిరియాల ప్లాంటేషన్ చేపట్టగా ఈ ఏడాది 30 హెక్టార్ లలో చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (అటవీ, పర్యావరణ) నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిసిఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ప్రదీప్ కుమార్, చిరంజీవి ఛౌదరి (పిసిసిఎఫ్ – క్యాంపా), పిసిసిఎఫ్ (ప్రొడక్షన్) ఆర్పి ఖజూరియా, పిసిసిఎఫ్ (రీసెర్చ్) అజయ్ కుమార్ నాయక్, పిసిపిఎఫ్ ఎకె ఝా ఎపిఎఫ్ డిసి విసి అండ్ ఎండి పికె సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఆరు నెలల్లో మోటార్లకు మీటర్లు పూర్తి: పెద్దిరెడ్డి