Probe: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారణకు ఆదేశించారు. కాసేపటి క్రితం అచ్యుతాపురం SEZ లో అమోనియా గ్యాస్ లీకై పలువురు కార్మికులు స్పృహ కోల్పోయిన సంగతి తెలిసిందే. క్వాంటం సీడ్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న మహళా కార్మికులపై ఈ లీక్ ప్రభావం అధికంగా పడింది. ఘాటైన వాయువులు వెలువడడంతో వారు స్పృహ కోల్పోయారు.
100మందికి పైగా వాంతులు, తల తిరగడంతో స్పృహ కోల్పోయి అస్వస్థతకు లోనయ్యారు. సమీపంలోని కెమికల్ కంపెనీ నుంచి అమోనియా వాయువు లీకైందని అనుమానాలు తలెత్తుతున్నాయి. బాధితులను అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. కార్మికుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై సిఎం జగన్ ఆరా తీశారు, బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళాలని సూచించారు.