Emotional failure: కమలహాసన్ కథానాయకుడిగా .. ఆయన సొంత బ్యానర్లో ‘విక్రమ్‘ సినిమా రూపొందింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ లుక్ .. ఆయన స్టైల్ ను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంది. ఆయన పాత్ర నుంచి విభిన్నమైన కోణాలను ఆవిష్కరించిన తీరు బావుంది. ఫహాద్ ఫాజిల్ .. విజయ్ సేతుపతి .. నరేన్ ముఖ్యమైన పాత్రలను పోషించగా, ప్రత్యేకమైన పాత్రలో సూర్య కనిపించాడు. పాత్రలు ఎక్కువగానే కనిపించినప్పటికీ, ఏ పాత్రకు తగిన ప్రాధాన్యత ఆ పాత్రకి ఉంది.
చెన్నై లో డ్రగ్స్ సరఫరా విచ్చలవిడిగా జరుగుతూ ఉంటుంది. డ్రగ్స్ కారణంగా యువత నిర్వీర్యం అవుతుందని తెలుసును గనుక, ఆ ముఠా ఆటకట్టించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. శత్రువు చాలా బలవంతుడని తెలిసి కూడా అతనిని ఢీ కొడతాడు. ఫలితంగా అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? తాను అనుకున్న లక్ష్యాన్ని ఆయన ఛేదించగలుగుతాడా? అనేది కథ. స్క్రీన్ ప్లే పరంగా ఫస్టాఫ్ లో కాస్త క్లారిటీ తగ్గినా, ఒకరకమైన క్యూరియాసిటీతో నడుస్తుంది.
ఈ మొత్తం ఆపరేషన్లో హీరో తనని తాను కాపాడుకుంటూ .. పసివాడైన తన మనవడిని రక్షించుకుంటూ ఉండవలసి వస్తుంది. ఈ ఎమోషన్ చుట్టూనే యాక్షన్ బలపడుతూ ఉంటుంది. లోకేశ్ తన గత చిత్రమైన ‘ఖైదీ’ తరహాలోనే హీరోయిన్ .. డ్యూయెట్లు .. కామెడీ లేకుండా, చైల్డ్ సెంటిమెంట్ ను కనెక్ట్ చేరుస్తూ వెళ్లాడు. భారీతనం పరంగా సినిమాకి వంకబెట్టవలసిన వసరం లేదు. కాకపోతే యాక్షన్ సన్నివేశాలు కనెక్ట్ అయినంతగా ఎమోషన్ సీన్స్ కనెక్ట్ కాలేదు. కొన్ని ట్విస్టులు మాత్రం షాకిస్తాయి. అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అలాగే ఫొటోగ్రఫీ కూడా అదనపు బలాన్ని ఇచ్చిందని చెప్పచ్చు.
Also Read : ‘విక్రమ్’లో ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్!