Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకలవారి కళాపోషణ

కలవారి కళాపోషణ

Corporate Art: నా మిత్రుడు ఒకాయన పోలీసు అధికారి. తెలుగు భాషాభిమాని. తెలుగు పద్యం, పాట, జానపదం…చివరికి సినిమాల్లో మంచి డైలాగులకు కూడా పొంగిపోతూ ఉంటాడు. ఈరోజుల్లో అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగు గొప్పతనానికి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని పంచుతూ ఉంటాడు. అక్కడితో ఆగకుండా వివిధ రంగాల్లో ఉన్న తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తుంటాడు. వచ్చినవారందరికీ చిరు తిళ్లు, కాఫీ టీ ల నుండి మధ్యాహ్నం భోజనం దాకా అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. కొసరి కొసరి వడ్డిస్తాడు. మంచి వేదిక, అందరికీ వినిపించేలా మైక్ సిస్టం ఏర్పాటు చేస్తాడు. తను తక్కువ మాట్లాడి…వచ్చినవారి చేత ఎక్కువ మాట్లాడింపచేస్తాడు. ప్రతి నెలా ఒక ఆదివారం ఏర్పాటయ్యే ఈ సమావేశానికి నేను హైదరాబాద్ లో ఉంటే తప్పకుండా హాజరవుతుంటాను. “తెలుగు సంగమం” పేరిట లాభాపేక్ష లేని సంస్థగా దీన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాలను మరింతగా విస్తరింపచేయాలని ఆయన ప్రయత్నం. ఆ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుందాం.

ఆయన పోలీసు అధికారి కాబట్టి పిలిచినవారు భయంతో వస్తున్నారని అనుకోవాల్సిన పనిలేదు. ఒకవేళ అలా అనుకున్నా…అది భాష పరిరక్షణకు ఉపయోగపడుతోంది కాబట్టి…సొల్లు కబుర్లు కాకుండా చక్కటి…చిక్కటి తెలుగు తేనె రస చర్చ జరుగుతోంది కాబట్టి…ఆ భయానికి ఒక ప్రయోజనం, ఒక ఉపయోగం ఉన్నాయి. ఇలా కోటికొక్కరు పెద్దలు కలుగజేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.

Ambanis Daughter In Law

వేదాంతులకు కళ్లముందు స్పష్టంగా కనిపించే ఈ ప్రపంచమంతా ఒట్టి మిథ్య. మాయ. పుట్టినదేదయినా నశించేదే. భౌతికవాదులకు కళ్ల ముందు కనిపించేదంతా ఉన్నట్లే. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గ్లోబ్ రబ్బరు బొమ్మను కాలితో తంతూ భూగోళాన్ని ఫుట్ బల్ లా ఆడుకుంటున్నట్లు ఆనందించేవాడని “ది గ్రేట్ డిక్టేటర్” సినిమాలో చార్లీ చాప్లిన్ ఎగతాళిగా చూపించాడు. అలా అత్యంత సంపన్నులకు ఈ భూగోళం కాలితో ఆడుకునే ఒక బంతి. వారు నిలుచోమంటే ప్రపంచం నిలుచుంటుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. ప్రభుత్వాలు వారు చెప్పినట్లు వింటుంటాయి. వారి ఇంట్లో పులి పిల్లి. వారి పెరట్లో పిల్లి పులి. మన గుమ్మం ముందు సైకిల్, స్కూటర్ పార్క్ చేసినట్లు వారి కోసం హెలి క్యాప్టర్ రెక్కల పక్షులు, విమానాలు పార్కింగుల్లో ఎదురు చూస్తుంటాయి. ఏ పార్టీలు అధికారంలో ఉన్నా వారిచ్చే పార్టీల్లో ముందువరుసలో వినయంగా ఒదిగి ఉంటాయి. దేశాధ్యక్షులు, ప్రధానులను వారు భుజం తట్టి ప్రోత్సహించాల్సి వస్తుంది. వారి పిల్లలు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లో చదివి తప్పనిసరిగా వ్యాపారమే చేస్తూ సర్దుకుపోవాల్సి వస్తుంది.

డబ్బు డబ్బును ప్రేమిస్తుంది. డబ్బు డబ్బును సంపాదిస్తుంది. డబ్బు దబ్బున పేరు తెస్తుంది. డబ్బుకు లోకం దాసోహం. డబ్బే జీవిత పరమావధి. పైసామే పరమాత్మ. ధనమేరా అన్నిటికి మూలం. సిరిగలవానికే చెల్లున్. కలవారి వైభోగం. కలవారి పెళ్లి లోకానికే పెళ్లి. కలవారి కష్టం లోకానికే నష్టం.

Ambanis Daughter In Law

పోలీసు అధికారి అయిన నా మిత్రుడి తెలుగు సంగమానికే ప్రతి నెలా ఆదివారం పనులన్నీ మానుకుని అంతమంది వస్తే…ప్రపంచ కుబేరుల్లో ముందు వరుసలో ఉండే ముఖేష్ అంబానీ గారి కాబోయే కోడలు గారి భరతనాట్య అరంగ్రేటం కార్యక్రమానికి ఎంత మంది రావాలి? ఎన్నెన్ని పెద్ద పెద్ద తలకాయలు రావాలి? ఆగకుండా ఎన్ని నిముషాలు స్టాండింగ్ ఒవేషన్ గా కరతాళ ధ్వనులు మోగాలి? ఆ వార్త తెల్లారేసరికి పాఠకులకు ఎన్నెన్ని వైనాలుగా చేరాలి?

అలాగే వచ్చింది మీడియాలో వార్త. భరత నాట్యానికి ఇక మహర్దశ పట్టినట్లు…అన్ని పత్రికల్లో, టీ వీ ల్లో వార్తలే వార్తలు. ఇందులో అంబానీ దంపతులు చక్కగా ఉన్నారు. వారి కాబోయే కోడలు నవరసాలను పండించినట్లే ఉంది. ఆ మర్చెంట్ కోడలు ఇలాగే సరిహద్దుల గోడలు దాటి భరతనాట్య కీర్తి పతాకను వినువీధిలో రెపరెపలాడించాలని మనం కూడా కోరుకోవాలన్నట్లు ఈనాడు ఒక పులకింతతో వార్తను వండి వార్చింది.

కలవారి వీపు మీద చిన్న పుండు లేచినా…ప్రపంచానికి అది వార్త అయి తీరుతుందని మన యోగి వేమన ఏనాడో తీర్మానించాడు. అలాంటిది నవరస భరితంగా ఒక ప్రపంచ కుబేరుడి కాబోయే కోడలు నాట్యం చేస్తే…అది వార్త కాకుండా పోతే…వార్తా ప్రాధాన్యాలకు, ప్రమాణాలకే వెలితి.

“మడిసన్నాక కాసింత కళాపోషణుండాలయ్యా.
ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటాది?”

ముఖేష్ అంబానీ (కాబోయే) రెండో కోడలు నాట్యం నేర్చుకుని…నాట్య ప్రదర్శనలు ఇవ్వడంలో భారతీయ కళ పరిరక్షణే కాకుండా… బతుకు నిత్య నృత్యం అయిన సామాన్యులకు ఏదో ప్రతీకాత్మక సందేశం కూడా ఉండి ఉండవచ్చు. దేవుడి నట్టువాంగానికి మనం నాట్యం చేస్తూ ఉంటాం. అందుకే ఆడేది…ఆడించేది…పాడేది…పాడించేది…అంతా పైవాడే అని స్పష్టంగా చెబుతూ ఉంటాం.

రిలయన్స్ నట్టువాంగానికి జియో వేదికమీద మర్చెంట్ నాట్యం అంటే…ఆడేది…ఆడించేది…పాడేది…పాడించేది…ఎవరన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. కలవారి నట్టువాంగానికి అరేబియా కడలి కదలి వెళ్లడంలో ఔచిత్యభంగం జరగలేదు.

భరతనాట్యానికి ఆదిగురువు అయిన సాక్షాత్తు నటరాజస్వామే దిగివచ్చి నాట్యం చేసినా…మీడియాలో ఇంత కవరేజ్ రాదేమో?” అని ఒక కళారాధకుడయిన జర్నలిస్టు మిత్రుడు కళా వార్తారస చర్చలోకి దిగాడు.

“రసపట్టులో తర్కం పనికిరాదు.”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఏది ప్రభుత్వం? ఏది ప్రయివేటు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్