రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుల చేసింది. వచ్చే నెల 21వ తేదీతో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ నెల 15వ తేదిన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈ నెల 29 వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ, జూన్ 30న నామినేషన్ల పరిశీలన, జూలై 2వ తేది వరకు ఉపసంహరణకు గడువు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తారు. జూలై 21న కౌంటింగ్ నిర్వహిస్తారు. జూలై 28 లోగా కొత్త రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
జులై 25న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 ప్రకారం ఆనాటి కల్లా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదిచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన చట్టసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. 776 పార్లమెంటేరియన్లు, 4,120 మంది లెజిస్లేటర్లు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ బలం 10,98,903 ఓట్లుగా ఉంటుంది. లోక్ సభ, రాజ్యసభ, శాసనసభలోని నామినేటెడ్ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. వీరికి ఓటు ఉండదు.
బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటింగ్ జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. వేరే పెన్నుతో ఓటు వేస్తే అది చెల్లుబాటు కాదు. అంతేకాదు, రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేయకూడదు. ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుంది.