Stupendous Victory: ఇండియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో సౌతాఫ్రికా అద్భుత విజయం సాధించింది, ఇండియా విసిరిన 212 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని19.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి సత్తా చాటింది. డేవిడ్ మిల్లర్, వాండర్ దస్సేన్ నాలుగో వికెట్ కు అజేయమైన 131 పరుగులు జోడించారు. ఈ విజయంతో ఇండియాపై టి 20లో అత్యధిక స్కోరు ఛేజ్ చేసిన జట్టుగా ప్రోటీస్ ఘనత సాధించింది. సౌతాఫ్రికాకు కూడా ఇదే అత్యధిక రన్ ఛేజ్ మ్యాచ్ కావడం గమనార్హం.
16వ ఓవర్ పూర్తయ్యే నాటికి 32 బంతుల్లో 30 పరుగులు చేసిన వాండర్ దస్సేన్ ఒక్కసారిగా జూలు విదిల్చాడు. హర్షల్ పటేల్ వేసిన 17వ ఓవర్లో డస్సెన్ మూడు సిక్సులు,ఒక ఫోర్ తో 22 పరుగులు చేశాడు. 18వ ఓవర్లో ఇద్దరూ కలిసి 22 పరుగులు చేశారు. దీనితో సౌతాఫ్రికా విజయం ఖాయమైంది. చివరి రెండు ఓవర్లలో12 రన్స్ కావాల్సి ఉండగా 19 వ ఓవర్లో హర్షల్ 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ తొలి బంతిని ఫోర్ గా మలిచిన దస్సేన్ అపూర్వమైన విజయాన్ని అందించాడు.
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, ఆర్ష దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లకు తొలి మ్యాచ్ లో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్- రుతురాజ్ గైక్వాడ్ లు ఇన్నింగ్స్ ఆరంభింఛి తొలి వికెట్ కు 57 పరుగులు చేశారు. 15 బంతుల్లో మూడు సిక్స్ లతో 12 పరుగులు చేసిన రుతురాజ్ ఔటయ్యాడు. ఇషాన్- శ్రేయాస్ అయ్యర్ లు రెండో వికెట్ కు 80 పరుగులు జోడించారు. అయ్యర్ 36; ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి ఔటయ్యారు. రిషభ్ పంత్ 16 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లతో 29 పరుగులు చేసి చివరి ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు.
ఇటీవలి ఐపీఎల్ టోర్నీలో సత్తా చాటిన హార్దిక్ పాండ్యా నేటి మ్యాచ్ లో కూడా వీర విహారం చేశాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీనితో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నార్త్జ్, పార్నెల్, ప్రెటోరియస్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
సౌతాఫ్రికా 22 పరుగుల వద్ద తొలి వికెట్ (కెప్టెన్ బావుమా-10) కోల్పోయింది. కేవలం 13 బంతుల్లో ఒక ఫోర్ నాలుగు భారీ సిక్సర్లతో మంచి ఊపుమీద ఉన్న ప్రెటోరియస్ ను హర్షల్ పటేల్ బౌల్డ్ చేయడంతో 61 వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డికాక్ 22 పరుగులు చేసి మూడో వికెట్ గా వెనుదిరిగారు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్-దస్సేన్ లు ధాటిగా ఆడారు. ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్, భువీ, హర్షల్ పటేల్ కు తలా ఒక వికెట్ దక్కింది.
వాండర్ దస్సేన్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
Also Read : ఇండోనేషియా మాస్టర్స్: క్వార్టర్స్ కు సింధు