Please Come: కొన్ని చిత్రాలు చిత్ర విచిత్రమయిన కథలను చెప్పకనే చెబుతుంటాయి. అలాంటి ఒకానొక చిత్రమిది. బడి మానేసిన మీ పిల్లలను మళ్లీ బడికి పంపండి తల్లిదండ్రులారా! అంటూ ఒక ప్రధానోపాధ్యాయుడు రోడ్డు మీద పడుకుని వేడుకుంటున్నారు. స్కూలు ఎగ్గొట్టిన పిల్లల్లారా! బడికి రండి…అంటూ ఒకానొక జిల్లా విద్యాధికారి పిల్లల ఇంటి మెట్ల మీద కూర్చుని ప్రాధేయపడుతున్నారు. బహుశా ఇంకా చాలా చోట్ల “బడిబాట” “మళ్లీ బడికి” లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటి చిత్రాలే ఉండి ఉంటాయి. బళ్లో చదువులు చెప్పడమే కాకుండా…బడికి రండి అంటూ రోడ్ల మీద పడి ఎండా వానల్లో తిరుగుతున్న ప్రతి టీచరు కాలి ధూళి మన నెత్తిన చల్లుకున్నా రుణం తీరదు.
ఈ చిత్రం చూడ్డానికి ఒక వింత వార్తగా ఉన్నా…టీచర్లను రోడ్లపాలు చేసిన మనమే ఆ చిత్రంలో కనిపిస్తాం. అందులో రోడ్డున పడింది పాఠాలు చెప్పే గురువులు కాదు. ప్రభుత్వ పాఠాలను అసహ్యించుకుని రోడ్డున పడుతున్నది మనమే.
ఈ చిత్రాలు ఇక్కడితో ఆగవు. వీటి కొనసాగింపుగా ఇంకా చాలా చిత్రాలు ఉంటాయి. “Doing business is not our business” అని ప్రభుత్వాలు వజ్ర వైడూర్య మరకత గోమేదిక పుష్య రాగ నవరత్నాలను పప్పు బెల్లాల కింద అమ్మడానికి ఈ టీచర్లు రోడ్డున పడడానికి తాత్వికంగా సంబంధం, కార్య కారణ సంబంధాలు ఉన్నాయి.
“ప్రభుత్వం వద్దు;
ప్రయివేటు ముద్దు”
అన్న భావన మన నరనరాన ఎక్కడానికి ప్రభుత్వ విధానాలే కారణం. లెక్క కడితే ఎంత సంపదో తెలియనంత బి ఎస్ ఎన్ ఎల్, రైల్వే, ఎల్ ఐ సి ఇప్పుడు ఆత్మ విశ్వాసం సడలి…ఆత్మగౌరవం తగ్గి…రోడ్డున పడడానికి ఈ ఉపాధ్యాయులు రోడ్డున పడడానికి కార్యకారణ సంబంధం ఎవరికీ కనపడదు. ప్రభుత్వ యూనివర్సిటీలో సీటు దొరికితే సరస్వతి ఒళ్లో చోటు దొరికినట్లే అనుకున్న కాలాలు పోయి…అమెరికా ఎమ్మెస్ కు అప్పు దొరికితే లక్ష్మీ దేవి చేయి పట్టుకున్నట్లే అనుకునే రోజులు రావడానికి…ఈ ఉపాధ్యాయులు వీధిన పడడానికి కార్యకారణ సంబంధం మనకు వినపడదు. పది, పదిహేను ఊళ్లకొక ప్రభుత్వ బడిలో వేల మంది విద్యార్థులతో చదువుల పండగగా సాగిన రోజులు పోయి…వీధికొక ప్రయివేటు కాన్వెంటు పుట్టగొడుగు నీడల్లో చిలకపలుకులకు మురిసిపోతున్న రోజులు రావడానికి…ఈ టీచర్లు ఊరిమీదపడి తిరగాల్సి రావడానికి కార్య కారణ సంబంధం మనం అర్థం చేసుకోలేం.
ప్రభుత్వ బడి అంటే డబ్బు లేనివారు మాత్రమే చేరాల్సిన చోటు అని మనకు మనమే ప్రభుత్వ చదువులకు సామాజిక అంటరానితనం ఆపాదించిన అజ్ఞానానికి…ఈ టీచర్లు ఇలా తల్లిదండ్రుల కాళ్లు పట్టుకోవడానికి కార్యకారణ సంబంధం మనకు ఒకరు చెప్పినా అర్థం కాదు. నెలకు పదివేలు సంపాదించే పేదవారయినా నెలకు అయిదు వేలు పెట్టి తమ పిల్లలను ప్రయివేటు కాన్వెంట్లలో చదివిస్తున్న చదువుల తపనకు…ఈ అయ్యవార్లు ఇలా ఎండల్లో స్పృహదప్పి పడుకోవడానికి కార్యకారణ సంబంధం ఎవరయినా విడమరిచి చెప్పినా మనకు పట్టదు. ఒక పక్క ప్రపంచం ఇంగ్లీషు మీడియం పెను ప్రవాహ వేగంలో వెళుతుంటే…ప్రభుత్వ బళ్లలో ఆ మీడియం అవసరాన్ని గుర్తించని ఏలికల నిర్లక్ష్యానికి…ఇలా టీచర్లు పిల్లల చేతులు పట్టుకుని…ఇవి చేతులు కావు…కాళ్లు అనుకోండి…అని తమను తాము తక్కువ చేసుకోవడానికి కార్యకారణ సంబంధం మీద టి వి డిబేట్లు జరగవు.
శివుడికి అనుమానాలొస్తే బ్రహ్మ జ్ఞానం మూర్తీభవించిన సుబ్రహ్మణ్యుడి దగ్గర నివృత్తి చేసుకున్నాడు. కొడుకే అయినా శివుడు కింద కూర్చుంటే…పైన గురు స్థానంలో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. అది గురుస్థానం కాబట్టి శివుడయినా ఒక మెట్టు కింద ఉండాల్సిందే. పరమశివుడు కాబట్టి ఆయన గురువును గౌరవించాడు. గురు స్థానానికి సమున్నతమయిన విలువ ఇచ్చాడు.
మనమేమో గురువులను నాలుగు మెట్లు కిందకు తోసి…నడి వీధిపాలు చేశాం. ఈ అవమానం గురువులకు కాదు. అక్షరాలా మనకే.
సార్! మేడం!
మమ్ము మన్నిస్తారా?
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :