Sunday, January 19, 2025
HomeTrending Newsమనసు కలచివేసింది : సిఎం జగన్

మనసు కలచివేసింది : సిఎం జగన్

ప్రకాశం బ్యారేజ్ (సీతానగరం) గ్యాంగ్ రేప్ ఘటన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన బాధాకరమని, ఇలాంటివి  పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట కూడా నిర్భయంగా తిరగ గలిగే పరిస్థితులు ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని తాను కూడా బలంగా విశ్వసిస్తానని, మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నామని సిఎం జగన్ స్పష్టం చేశారు.

మహిళలపై దాడులు అరికట్టేందుకు దిశ చట్టం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపామని, రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, దిశా కేసుల కోసం ప్రతి జిల్లలో ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసి క్యూటర్లను కూడా నియమించామని ముఖ్యమంత్రి వివరించారు. అభయం, దిశా యాప్ లను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మహిళల రక్షణకు 900 మొబైల్ పెట్రోలింగ్ టీమ్ లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఓ మహిళా పోలీస్ ను కూడా నియమించామని చెప్పారు, ఇన్ని చేస్తున్నా ప్రకాశం బ్యారేజ్ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం బాధాకరమన్నారు.

సిఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చేయూత రెండో ఏడాది అమలును ముఖ్యమంత్రి  ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ప్రతీ ఏటా రూ. 18,750 చొప్పున వరసగా నాలుగేళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్ధిక సాయం అందజేస్తారు.  ఈ ఏడాది 23,14,342 లబ్ధిదారులకు  రూ. 4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని జమ చేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ఇప్పటి వరకూ తమ ప్రభుత్వం పనితీరు గమనిస్తే తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని నిరూపించామని,  ప్రతి ఇంట్లో అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో ఆనందంగా ఉండే ఆ ఇళ్లు బాగుంటుందని తన గట్టి నమ్మకమని వెల్లడించారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ చట్టం చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో తమదేనని జగన్ గుర్తు చేశారు. ఆలయ బోర్డులు, బిసి కార్పోరేషన్ పదవులు, మార్కెట్ యార్డులు, మున్సిపాలిటీల్లో అక్కచెల్లెమ్మలకు అగ్రస్థానం కల్పించామన్నారు. తన ఒక చెల్లి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉంటె మరో చెల్లి హోం శాఖ మంత్రిగా ఉన్నత పదవుల్లో ఉన్నారన్నారు.  అక్కచెల్లెమ్మల భద్రత విషయంలో మరింత కష్టపడి పనిచేస్తామని సిఎం జగన్ భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్