డబుల్ ఇంజన్లతో కేంద్రం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోందని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని, దమ్ముంటే, తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశంలో ఎక్కడైనా ఉందా? చూపాలని రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు బిజెపి, ప్రధాన మంత్రి మోడీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే, బిజెపి పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని వారు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర రెడ్కో చైర్మన్ గా నియమితులైన వై.సతీష్ రెడ్డి శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లోని రెడ్కో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం జరిగిన సభలో మంత్రులు మాట్లాడుతూ, వాట్సాప్ యూనివర్సిటీల కేంద్రంగా బిజెపి అసత్యప్రచారాలకు దిగుతోందని పేర్కొన్నారు. అటువంటి అసత్యాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పారు. గుజరాత్ నమూనాను చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి అదే గుజరాత్ ను ఇప్పుడు చీకట్లోకి నెట్టేసిందన్నారు. వ్యవసాయానికి ఆరు గంటలు కూడ కరెంట్ ఇవ్వకపోగా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించిన అంశాన్ని మంత్రులు గుర్తుచేశారు. యావత్ భారతదేశంలో చీకట్లు అలుముకున్న రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో వెలుగులు నింపిందన్నారు.
శత్రు దుర్బేద్యమైన కోటగా టిఆర్ఎస్ రూపుదిద్దుకుందని వారు తెలిపారు. నిర్మాణాత్మకమైనపార్టీగా ప్రజల నుండి అనూహ్యమైన ఆదరణ టిఆర్ఎస్ కు లభిస్తుందన్నారు. సభ్యత్వ నమోదు కోసం ప్రజలు బారులు తీరడమే ఇందుకు అద్దం పడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనమే ఇందుకు కారణంగా నిలుస్తుందన్నారు.టీఆరెస్ లా పని చేస్తున్న పార్టీలు దేశంలో లేవు. కృష్ణా, గోదావరి జలాలను, రోడ్లు, మురుగునీటి కాలువలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు.
Also Read : ప్రజలు, రైతుల కోసమే అప్పులు..TRS