ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా- శ్రీలంక జట్ల మధ్య నేడు జరిగిన చివరి మ్యాచ్ లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ఆతిథ్య శ్రీలంక సిరీస్ ను గెల్చుకోగా సిరీస్ 3-2తో ముగిసింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో లంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో కరునరత్నే 75 పరుగులతో రాణించాడు. కుశాల్ మెండీస్ ఒక్కడే 26 స్కోరు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో 43.1 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో హాజెల్ వుడ్, కమ్మిన్స్, కుహ్నెమన్ తలా రెండు వికెట్లు, మాక్స్ వెల్, గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆసీస్ కూడా 50 పరుగులకు నాలుగు వికెట్లు(కెప్టెన్ పించ్ డకౌట్, వార్నర్-10; జోష్ ఇంగ్లిస్ -5; మిచెల్ మార్ష్-24) కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో లబుస్ చేంజ్- అలెక్స్ క్యారీ లు ఐదో వికెట్ కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నారు. లబుస్-31; మాక్స్ వెల్-16 పరుగులు చేసి అవుట్ కాగా, క్యారీ-45; కామెరూన్ గ్రీన్-25 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించారు. ఆసీస్ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని (164) ఛేదించింది.
లంక బౌలర్లలో దునీత్ వెల్లలగె మూడు; మహీష్ తీక్షణ రెండు; ప్రమోద్ మదుసన్ ఒక వికెట్ పడగొట్టారు.
75 పరుగులు చేసిన లంక ఆటగాడు కరునరత్నే కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కగా; కుశాల్ మెండీస్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కింది.