ఇండియా-శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న మూడు 20ల సిరీస్ ను 2-0తో ఇండియా గెల్చుకుంది. నేడు రెండో మ్యాచ్ లో 5 వికెట్లతో విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మందానా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు.
దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విష్మి గుణరత్నె-కెప్టెన్ ఆతపట్టులు తొలి వికెట్ కు 87 పరుగులు జోడించి గట్టి పునాది వేసినా మిగిలిన బ్యాట్స్ విమెన్ ఈ జోరు కొనసాగించలేకపోయారు. ఓపెనర్లు ఇద్దరే (గుణరత్నె-47; ఆటపట్టు-43) రెండంకెల స్కోరు దాటారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ రెండు; రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, కెప్టెన్ కౌర్ లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత మహిళలు 30 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయారు. షఫాలీ17 పరుగులు చేసి ఔటయ్యింది. సబ్బినేని మేఘన కూడా 17 చేసి వెనుదిరిగింది. మరో ఓపెనర్ మందానా 34 బంతుల్లో 8 ఫోర్లతో 38 పరుగులు చేసి స్టంప్ ఔట్ గా పెవిలియన్ చేరింది. తొలి మ్యాచ్ లో రాణించిన రోడ్రిగ్యూస్ ఈ మ్యాచ్ లో విఫలమై కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది. యస్తికా భాటియా-13 పరుగులు చేసి చివర్లో వెనుదిరిగింది. కెప్టెన్ కౌర్ 31 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చడంతో పాటు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ ను కూడా గెల్చుకుంది.
లంక బౌలర్లలో రణవీర, రణసింఘే చెరో రెండు; సుగంధిక కుమారి ఒక వికెట్ పడగొట్టారు.