రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచనను గౌరవించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సూచించారు. పరీక్షలు నిర్వహిస్తామంటున్న ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని లోకేశ్ అన్నారు. నేపథ్యంలో ఏపీలో తక్షణమే పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దేశమంతా రద్దు చేస్తే, ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతామని ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కావడంలేదని విమర్శించారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలంటూ రెండు నెలలుగా పోరాడుతున్నా, జగన్ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా అఫిడవిట్ దాఖలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహించడం దారుణమన్నారు. ఇప్పటికైనా వ్యవస్థల ఆదేశాలను గౌరవించి తక్షణమే పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు.