ఇండియా-శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య నేడు జరిగిన మూడో టి20లో శ్రీలంక ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. మొదటి రెండు మ్యాచ్ లను గెల్చుకొని సిరీస్ ఇండియా గెల్చుకున్న సంగతి తెలిసిందే. నేటి మ్యాచ్ లో లంక కెప్టెన్ చమరి ఆటపట్టు అద్భుతంగా రాణించి 48 బంతుల్లో 14 ఫోర్లు, 1సిక్సర్ తో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ మరోసారి విఫలమై 5 పరుగులే చేసి ఔటయ్యింది. మరో ఓపెనర్ స్మృతి మందానా, శబ్బినేని మేఘన చెరో 22 పరుగులు చేసి వెనుదిరిగారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్- రోడ్రిగ్యూస్ నాలుగో వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోడ్రిగ్యూస్ 33 పరుగులు చేసి ఔటవ్వగా, హర్మన్ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. పూజా వస్త్రాకర్ ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.
లంక బౌలర్లలో సుగంధిక కుమారి, అమ కాంచన, రణసింఘే, రణవీర తలా ఒక వికెట్ పడగొట్టారు.
శ్రీలంక 6 పరుగులకే తొలి వికెట్ (విష్మి గుణరత్నె-5) కోల్పోయింది. 37 వద్ద హర్షిత మాధవి(13) కూడా పెవిలియన్ చేరింది. ఈ దశలో కెప్టెన్ చమరి ఆటపట్టు- నీలక్షి డిసిల్వా మూడో వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డిసిల్వా 30 పరుగులు చేసి రనౌట్ కాగా, చమిర-కవిష్కలు మరో వికెట్ పడకుండా లక్ష్యం ఛేదించారు.
ఇండియా బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
చమరి ఆటపట్టు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, హర్మన్ ప్రీత్ కౌర్ ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ గెల్చుకున్నారు.
Also Read : Women Cricket: శ్రీలంకపై ఇండియా గెలుపు: సిరీస్ కైవసం