న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది. మూడో టెస్టులో ఇంగ్లాండ్ 7 వికెట్లతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జానీ బెయిర్ స్టో మరోసారి టి20 తరహా బ్యాటింగ్ తో అదరగొట్టి ఇంగ్లాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఎక్కడ ఆగిపోతుందోనని ఇంగ్లాండ్ ఆటగాళ్ళు టెన్షన్ పడినా చివరకు ఆట మొదలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
రెండు వికెట్లకు 182 పరుగులతో నేటి ఐదోరోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ తొలి ఓవర్లోనే ఓలీ పోప్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో మరోసారి కీవీస్ బౌలర్లపై తన ప్రతాపం చూపాడు, 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 71, నిన్న 55 పరుగులతో క్రీజులో ఉన్న జో రూట్ 86 పరుగులతో అజేయంగా నిలిచి విజయం అందించారు.
టెస్ట్ మ్యాచ్ లో మొత్తం 10 వికెట్లతో రాణించిన ఇంగ్లాండ్ బౌలర్ జాక్ లీచ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించగా బ్యాట్స్ మ్యాన్ జో రూట్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కింది.