ఇండియా-ఐర్లాండ్ మధ్య జరిగిన రెండు మ్యాచ్ ల టి20 సిరీస్ ను ఇండియా గెల్చుకుంది. నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ఇండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 226 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఐర్లాండ్ స్ఫూర్తి దాయకమైన ఆట తీరు కనబరిచి విజయం కోసం చివరికంటూ పోరాడింది.
నేటి మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, జట్టు స్కోరు 13 వద్ద ఓపెనర్ ఇషాన్ కిషన్ (3) ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ సంజూ శామ్సన్- దీపక్ హుడా రెండో వికెట్ కు 176 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. సంజూ 42 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 15 మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీపక్ హుడా అంతర్జాతీయ టి20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు, 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేసి నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ డకౌట్ అయ్యారు. కెప్టెన్ పాండ్యా 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు; జోసువా లిటిల్, క్రేగ్ యంగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
లక్ష్య సాధనలో ఐర్లాండ్ తొలి వికెట్ కు 72 పరుగులు చేసింది. కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్ని-60; పాల్ స్టిర్లింగ్-40; హేరీ టెక్టార్-39; జార్జ్ డాక్రెల్-34; మార్క్ అడైర్-23 పరుగులు చేశారు. ఇండియా బౌలర్లు 20 ఎక్స్ ట్రా పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేయగలిగింది.
ఇండియా బౌలర్లలో భువనేశ్వర్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
దీపక్ హుడాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ కూడా దక్కింది.
Also Read : India Vs Ireland T20: ఏడు వికెట్లతో ఇండియా విజయం