Jagan Review on IT Policy :
మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. భవిష్యత్ తరాలకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత ఇవాలని, వారికి ప్రోత్సాహకాలను అందించాలని ఆదేశించారు. దీనివల్ల పిల్లల్లో అంతర్జాతీయ స్థాయిలో పని చేసే అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయని, ప్రపంచ స్థాయితో పోటీపడే పరిస్థితి వస్తుందని చెప్పారు.
ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు,వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి తదితరులు హాజరయ్యారు.
భవిష్యత్‌లో ఐటీ రంగానికి, ఉద్యోగాల కల్పనకు విశాఖపట్నం కేంద్రంగా మారుతుందని, ప్రభుత్వం కల్పించనున్న మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇవన్నీ కూడా నగరం స్థాయిని మరింతగా పెంచుతాయని సిఎం వివరించారు. నాణ్యమైన విద్యకు విశాఖ నగరాన్ని కేంద్రంగా చేయాలని ఉద్భోదించారు. .
వర్క్ ఫ్రం హోం విధానాన్ని బలోపేతం చేస్తామని, గ్రామాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని దీని ద్వారా అక్కడి నుంచే పనిచేసుకునే సదుపాయం ఉంటుందని వెల్లడించారు.
విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం నగరాలను ఐటీ కాన్సెప్ట్ సిటీలుగా తయారు చేస్తామని, దీనికి అవసరమైన భూములను గుర్తించి, ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మిస్తున్న వైయస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్టరింగ్ క్లస్టర్లు(ఈఎంసీ) పురోగతిపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని, అక్టోబరులో ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
Also Read : అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ!