Inspiration: అల్లూరి సీతారామ రాజు స్ఫూర్తి, ఆయన చూపిన చొరవతో ముందుకు వెళ్తే మనలను ఆపే శక్తి ఎవరికీ ఉండబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. ‘దమ్ముంటే నన్ను ఆపు’ అంటూ అల్లూరి ఆంగ్లేయులకు విసిరిన సవాల్ ను మనం కూడా ప్రేరణగా తీసుకొని ముందుకు సాగితే తిరుగు ఉండదని స్పష్టం చేశారు. భీమవరంలో కేంద్ర పర్యాటక శాఖ- రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలను మోడీ ప్రారంభించారు. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోడీ మాట్లాడుతూ… దేశంలోని యువత అవకాశాలను అందిపుచ్చుకొని తమతో పాటు సమాజాన్ని కూడా అభివృద్ధి చేయాలని పిలుపు ఇచ్చారు. “భారత్ మాతాకీ జై, మన్యం వీరుడు, తెలుగుజాతి యుగ పురుషుడు, తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా….అంటూ స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికే స్ఫూర్తి దాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నెల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోడీ ప్రారంభించారు.
అల్లూరి జీవితం మనందరికీ స్పూర్తిగా ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు ప్రధాని. ఆదివాసీల హక్కులకోసం, వారి సంక్షేమం కోసం పోరాడిన గొప్ప యోధుడని ప్రశంసించారు. భారత దేశ ఆదిసీల ధైర్యానికి, శౌర్యానికి అల్లూరి ఓ ప్రతీకగా నిలుస్తారని కొనియాడారు. ఏక్ భరత్ – శ్రేష్ట్ భారత్ అన్న నినాదానికి ది అల్లూరి పోరాటం ఓ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అల్లూరి కుటుంబీకులను సన్మానించుకోవడం మనందరి అదృష్టమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన సమరయోధులందరికీ మోడీ నివాళులు అర్పించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలతో పాటు రంప ఆందోళన శత జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నామని తెలిపారు. అల్లూరి జన్మించిన పాండ్రంగి, మోగల్లు, చింతపల్లి ప్రాంతాల్లో కూడా అయన జ్ఞాపకార్ధం స్మారక చిహ్నాలు నిర్మిస్తామన్నారు. లంబసింగిలో ఆదివాసీల జీవన చిత్రాన్ని ప్రతిబింబించే విధంగా ఓ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఆదివాసీ బిడ్డ థిర్సా ముండా జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు.
భారత స్వాతంత్ర సంగ్రామం ఏ ఒక్కరికో పరిమితం కాదని, ఇది దేశ ప్రజలందరికు సంబంధించిన విషయమని, గత చరిత్రను, యోధులను, అమరవీరులను, వారి పోరాటాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే మనదరం ఒక జాతిగా ఏకమయ్యామని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఓ పుణ్య భూమి అని, ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన ప్రాంతమని అయన అభివర్ణించారు. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరు వీరేశ లింగం, పొట్టి శ్రీరాములు లాంటి ఎందరికో జన్మనిచ్చిన పురిటి గడ్డ అన్నారు. ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర కూడా ఎంతో ప్రేరణ ఇస్తుందని మోడీ తన ప్రసంగంలో వెల్లడించారు.
దేశం కోసం, అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న యుగపురుషుడు అల్లూరి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఆయన ఎప్పటికీ చరితార్థుడన్నారు. ఒక దేశాన్ని ఇంకో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన సమరయోధులు కలలు కన్నారని, వారిని స్మరించుకుంటూ ఇలా ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు జగన్. “ స్వతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్నా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు భీమవరం వచ్చిన ప్రధాని మోడీ, గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చిరంజీవిలకు జగన్ హృదయపూర్వక స్వాగతం” అంటూ అతిథులను ఆహ్వానించారు.
అల్లూరి 125జయంతి వేడుకలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉన్న యువకులు, యువజన సంఘాలు ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. ఈ వేదికపై కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి, అల్లూరి జయంతి వేడుకల కమిటీ అధ్యక్షుడు కూడా ఉన్నారు.