Saturday, November 23, 2024
HomeTrending Newsవారి ఆటలు సాగనివ్వం: రేవంత్ రెడ్డి

వారి ఆటలు సాగనివ్వం: రేవంత్ రెడ్డి

No way: సిఎం కేసియార్ పూర్తిగా బిజెపి ప్రయోజనాలకోసమే పని చేస్తున్నారని, ఈ విషయం రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మరోసారి బైటపడిందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.  మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు సమావేశం అయినప్పుడు  టిఆర్ఎస్ హాజరుకాలేదని, బిజెపి అభ్యర్ధి గెలుస్తాడనే నమ్మకం వచ్చిన తరువాతే  విపక్షాల అభ్యర్ధి నామినేషన్ కు కేటిఆర్ హాజరయ్యారని  చెప్పారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అయినా, ఇప్పుడు బిఆర్ఎస్ అయినా అది నరేంద్ర మోడీకి ఉపయోగపడుతుందని అనిపిస్తేనే దాన్ని ముందుకు తీసుకు వెళతారని, మోడీకి నష్టం జరిగే పక్షంలో దాన్ని కొనసాగించబోరని రేవంత్ జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణ లో కూడా అధికార టిఆర్ఎస్ ను అదే స్థానంలో ఉంచి… మిగిలిన ప్రతిపక్షాలను నాశనం చేసి,  ఆ ప్రతిపక్ష  స్థానాన్ని ఆక్రమించాలని కేసిఆర్, ప్రశాంత్ కిషోర్ లతో కలిసి బిజెపి పన్నాగం పన్నుతోందని,  కానీ ఈ కుట్రలను ఇక్కడ పునరావృతం కానివ్వబోమని, వారి ఆటలు ఇక్కడ సాగవని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు  సమావేశమయ్యారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు.

టిక్కెట్ల హామీ ఇచ్చి ఎవరినీ పార్టీలో చేర్చుకోవడం లేదని, పార్టీ పట్ల నేతలకున్న విశ్వసనీయత, నిబద్ధతను దృష్టిలో ఉంచుకునే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అభ్యర్ధుల ఎంపికకు పార్టీ ఓ విధానాన్ని అనుసరిస్తుందన్నారు. పార్టీలో చేరికల విషయంలో వ్యూహాత్మకంగా, ఎత్తుగడలతో ముందుకెళ్తున్నామని రేవంత్ వ్యాఖ్యానించారు.  ముందుగా చెబితే అధికార పార్టీ ఆయా నేతలపై కేసులు పెట్టి, బెదిరించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కొంత గోప్యత పాటించాల్సి వస్తోందన్నారు.

కాంగ్రెస్ లోకి పెద్దఎత్తున చేరికలు ఉంటాయని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.  అన్ని జిల్లాల నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, పరేడ్ గ్రౌండ్స్ సభలో తెలంగాణ అభివృద్ధి మీద,  విభజన చట్టం హామీల విషయంలో మోడీ మాట్లాడతారని తాము ఆశించామన్నారు. సిఎం కేసిఆర్ కూడా ప్రధాని మోడీతో రాష్ట్రం గురించి నిలదీస్తారని భావించామన్నారు. వీరు అడగలేదు- వారు చెప్పలేదంటూ భట్టి  వ్యాఖ్యానించారు.   మోడీ ప్రసంగంలో ఒక్కసారి కూడా  కేసిఆర్ పేరు ప్రస్తావించలేదని, పసలేని ప్రసంగం చేసి వెళ్ళారని భట్టి విమర్శించారు.  దీన్ని బట్టి ఇద్దరూ కలిసే ఉన్నారని, కలిసి నాటకం ఆడుతున్నారని, ఈ సంగతి తెలంగాణా ప్రజలందరికీ అర్ధమైందన్నారు.  హైదరాబాద్ లో కేవలం బలప్రదర్శన చేయడానికే వచ్చినట్లున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్  పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అంతమాత్రాన అవి బెదాభిప్రాయాలుగా అనుకోవాల్సిన పనిలేదని భట్టి స్పష్టం చేశారు.

Also Read : కాంగ్రెస్ లోకి తీగల? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్