Prabhas effect: తమిళ తెరకి హీరోగా పరిచయమైన వారసులలో శిబి సత్యరాజ్ ఒకరు. తమిళంలో ఒకప్పుడు తనకంటూ మంచి మార్కెట్ .. ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సీనియర్ హీరో సత్యరాజ్ తనయుడే శిబి. వయసులో సత్యరాజ్ ఎలా ఉండేవారో, శిబి కూడా అలాగే కనిపిస్తూ ఉంటాడు. తమిళ తెరకి తాను పరిచయమై 20 ఏళ్లు అవుతోంది. ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన దాదాపు 20 సినిమాలు చేయడమే ఆశ్చర్యం. పోనీ కథల ఎంపిక విషయంలో జాగ్రత్తల వలన సంఖ్య తగ్గిందా అంటే, ఆ స్థాయిలో చెప్పుకోదగిన హిట్లు కూడా లేవు.
కోలీవుడ్ లోకి నిన్నగాక మొన్న ఎంట్రీ ఇచ్చినవారు టాలీవుడ్ కి దగ్గర దారి వెతుక్కుని మరీ వచ్చేస్తున్నారు. అజిత్ .. విజయ్ వంటి స్టార్ హీరోలే ఇక్కడ హిట్ అనిపించుకోవడానికి సతమతమవుతున్నారు. శిబి మాత్రం ఎందుకో టాలీవుడ్ ను లైట్ తీసుకున్నాడు. ఆయన సినిమాలు అనువాదాలుగా కూడా ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది లేదు. అందువలన ప్రస్తుతానికైతే శిబికి ఇక్కడ ఎలాంటి క్రేజ్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శిబి తాజా చిత్రమైన ‘మాయోన్’ తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ నెల 7వ తేదీన విడుదలవుతోంది. అరుణ్ నిర్మాణంలో .. కిశోర్ దర్శకత్వంలో ఈ సినిమా థియేటర్లకు రానుంది.
ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ కానుంది. శిబి సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ అలరించనుంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందిందనే విషయం మాత్రం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. తమిళంలోనే కాదు తెలుగులోను సత్యరాజ్ కి మంచి క్రేజ్ ఉంది. ‘మిర్చి’ సినిమా నుంచి ఆయన ఇక్కడి ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటూ వస్తున్నారు. సత్యరాజ్ కి ప్రభాస్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఇన్ స్టా ద్వారా శిబికి ప్రభాస్ గుడ్ లక్ చెప్పడమే కాకుండా, ఈ సినిమా ట్రైలర్ ను కూడా పోస్ట్ చేశాడు. ప్రభాస్ ప్రమోషన్ ఈ సినిమాపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.